ప్రధాన సూత్రధారుల అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి
కర్నూలు: జేసీబీ డ్రైవర్ ఏకంగా తన యజమానినే కిడ్నాప్ చేసి రూ.4కోట్లతో ఉడాయించిన ఘటన గత జూన్‌లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో 11 మందిని అరెస్టు చేయగా, ప్రస్తుతం ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు విడతల్లో రూ.3.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బనగానపల్లి పట్టణానికి చెందిన వినాయకరెడ్డి క్రషర్ వ్యాపారం చేస్తూ ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికవేత్తగా పేరు గడించాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన నరేష్ ఇతని వద్ద గత నాలుగేళ్లుగా జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే క్రమంగా ప్రవర్తనలో మార్పు కనిపించడంతో వినయకరెడ్డి అతడిని తొలగించాడు. ఇది మనసులో పెట్టుకున్న నరేష్ అతన్ని కిడ్నాప్ చేసి కోట్లు రాబట్టేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన సురేష్, శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, రంజిత్.. అనంతపురం జిల్లాకు చెందిన రవికుమార్, రంజిత్‌కుమార్, చెన్నా భాస్కర్, రఘులతో కిడ్నాప్‌నకు తెరలేపారు. అందరూ కలిసి గత జూన్ 3న బనగానపల్లిలో రెక్కీ నిర్వహించారు. 5వ తేదీ ఉదయం బనగానపల్లి నుంచి బేతంచర్లకు వినాయకరెడ్డితో పాటు ఆయన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి కారులో బయలుదేరారు. అదే సమయంలో కిడ్నాపర్లు నాలుగు కార్లలో వెంబడించి సీతారామాపురం మెట్ట వద్ద అడ్డగించారు.
కత్తిని చూపించి భరత్‌కుమార్‌రెడ్డి, వినాయకరెడ్డిలను కిందకు దించారు. వారిని కిడ్నాపర్ల కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ సాయినాథ్‌రెడ్డి అడ్డుకున్నారు. కిడ్నాపర్లు తండ్రీ కొడుకులతో పాటు డ్రైవర్‌ను కూడా కారులోకి కుక్కి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత వినాయకరెడ్డి తండ్రి నాగిరెడ్డికి ఫోన్ చేసి రూ.4 కోట్లు ఇవ్వాలని, లేకుంటే వాళ్లను చంపుతామని బెదిరించారు. భయపడిన నాగిరెడ్డి బంధువుల వద్ద డబ్బు తీసుకుని మొదటగా అనంతపురం జిల్లా కొత్తపల్లి వద్ద రూ.2 కోట్లు.. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద రూ.2 కోట్లు ముట్టజెప్పాడు. దీంతో కిడ్నాపర్లు 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురినీ విడిచిపెట్టారు. అయితే కిడ్నాపర్లు డబ్బు తీసుకొని కూడా తమ కుమారుడిని, మనవడిని వదిలిపెట్టరేమోనన్న ఆందోళనతో నాగిరెడ్డి జరిగిన విషయాన్ని బేతంచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. ఇంతలోనే కిడ్నాప్‌నకు గురైన ముగ్గురూ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు జూన్ 30న గుత్తి పట్టణంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.40 లక్షల నగదు, కత్తి, మూడు సెల్‌ఫోన్‌లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కిడ్నాప్ ప్రధాన నిందితుడు నరేష్, చెన్నా భాస్కర్, రఘులను శుక్రవారం వేకువజామున అనంతపురం జిల్లా గుత్తి వద్ద అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రూ.2.66 కోట్లు నగదు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి మొత్తం రూ.3.6 కోట్లు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడుతో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ ప్రియతమ్‌రెడ్డి, ఎస్‌ఐలు శివశంకర్, నాయక్, రాకేష్, నరేష్, జగదీశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, హరినాథ్‌రెడ్డి, పీఆర్‌ఓ చెన్నయ్యలను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment