● జిల్లాలో 2,318 మంది రైతులకు
మొండిచెయ్యి
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) కింద కేంద్రం రైతులకు 19వ విడత ఆర్థిక సహాయం చెల్లించేందుకు రంగం సిద్ధం చేసింది. 18వ విడతతో పోలిస్తే 19వ విడతలో ప్రయోజనం పొందే రైతుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాలకు పీఎం కిసాన్ సొమ్ము విడుదల చేయనున్నారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి మూడవ విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.2000 ప్రకారం పెట్టుబడి సాయం విడుదల కానున్నట్లుగా వ్యవసాయ అధికార వర్గాలు తెలిపాయి. 18వ విడతలో జిల్లాలో 2,45,252 మంది రైతులకు దాదాపు రూ.49.05 కోట్లు ప్రయోజనం లభించగా.. 19వ విడతలో లబ్ధి పొందే రైతుల సంఖ్య 2,42,934కు తగ్గింది. గత విడతతో పోలిస్తే 2,318 మంది రైతులు పీఎం కిసాన్‌కు దూరమయ్యారు. ప్రతి మండలంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గడం గమనార్హం. అత్యధికంగా తుగ్గలి మండలంలో 15,487 మంది రైతులకు రూ.3.09 కోట్లు, ఆదోనిలో 14,901 మంది రైతులకు రూ.2.98 కోట్లు, దేవనకొండ మండలంలో 13,713 మంది రైతులకు రూ.2.74 కోట్ల ప్రకారం ప్రయోజనం చేకూరనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
నేడు శ్రీశైలానికి
గవర్నర్ రాక
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబామల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్‌తో కలిసి సున్నిపెంట హెలిప్యాడ్‌ను పరిశీలించి బార్‌కేడింగ్, వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలని ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. రెండురోజులు గవర్నర్ శ్రీశైలంలో పర్యటిస్తారని వెల్లడించారు. శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథిగృహంలో గవర్నర్‌కు వసతి, అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లు చేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావును ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment