No Headline
● నడుం నొప్పికి చికిత్స కోసం ఆళ్లగడ్డకు చెందిన ఓ మహిళ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యశ్రీలో అనుమతి వచ్చినా అదనంగా రూ.30 వేలు చెల్లించారు. ఆసుపత్రి నిబంధనలతో కుటుంబసభ్యులు ఈ విషయం బయటికి చెప్పలేదు.
● ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు నగరానికి చెందిన ఓ యువకుడికి కాలు విరిగింది. కర్నూలు నగరంలోని ఓ ప్రముఖ ఎముకల డాక్టర్‌కు చెందిన ఆస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేసినా అదనంగా మరో రూ.20 వేలు చెల్లించారు.
● ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోనే ఆపరేషన్ చేయమంటే చేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ఉన్న ప్రతి నెట్‌వర్క్ ఆసుపత్రిలో వినిపించే మాట. ప్రాణంపై ఉన్న తీపితో అధిక శాతం మంది రోగులు, వారి కుటుంబీకులు వైద్యులు చెప్పిన మేరకు అదనంగా ముట్టజెప్పి వైద్యం చేయించుకుంటూ బతుకుజీవుడా అంటూ బయటపడుతున్నారు.
● కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో
వసూళ్ల పర్వం
● అధికారులకు ఫిర్యాదు చేసినా
ఫలితం శూన్యం
● తనిఖీల సమయంలో నోరుమెదపని
రోగులు, వారి సహాయకులు
● ఫిర్యాదు చేయకూడదని
ఆసుపత్రి యాజమాన్యాల ఒప్పందం
● దోపిడీపై స్వయంగా ప్రకటించిన
‘కూటమి’ ఎమ్మెల్యే
కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వానికి చెందిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇటీవల వ్యాఖ్యనించారు. అమాయక ప్రజల నిరక్షరాస్యత, వ్యాధి తీవ్రతను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నాయని ఇటీవల జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆరోపించారు. గత ఆరు నెలల కాలంలో జిల్లాకు రూ.118కోట్లు ఆరోగ్యశ్రీ కింద బిల్లుల రూపంలో ప్రభుత్వం విడుదల చేస్తే ఇంతకు రెండింతలు పలు ఆసుపత్రులు రోగుల నుంచి అక్రమంగా వసూలు చేసి ఉంటారని ఆయన విమర్శించారు.
ప్యాకేజీ సరిపోదని డబ్బు వసూలు
కర్నూలు జిల్లాలో మొత్తం 6,49,333 ఎన్‌టీఆర్ వైద్యసేవ కార్డులు, 128 ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో 98 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో మొత్తం 5,36,887 ఎన్‌టీఆర్ వైద్యసేవ కార్డులుండగా 101 నెట్‌వర్క్ హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో 65 ప్రభుత్వ ఆసుపత్రులు 24 ప్రైవేటు ఆసుపత్రులు, 12 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా మొత్తంగా 67 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే ప్యాకేజీ సరిపోదని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని రోగులను పరోక్షంగా బెదిరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులను తరచూ సందర్శించి రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, వారి ఫిర్యాదులకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే కొన్ని ఫిర్యాదు రావడంతో సదరు ఆసుపత్రికి వెళితే తామేమీ ఖర్చు పెట్టలేదని, ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదని కొందరు రోగులు చెబుతుండటంతో అధికారులు వెనుదిరిగి వస్తున్నారు. కొందరు ధైర్యంగా డబ్బులు ఇచ్చామని చెప్పడంతో తీసుకున్న దానికంటే రెట్టింపుగా జరిమానా వసూలు చేస్తున్నారు.
ఇదీ దుస్థితి..
ఆపరేషన్ అవసరమైన రోగులను మాత్రమే నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు సైతం ట్రస్ట్ నుంచి వేగంగానే వస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి కాలు, చేతులు విరిగిన వారు, పక్కటెముకలు విరిగిన వారు, మెదడుకు గాయాలైన వారు ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వెన్నుపూస ఆపరేషన్లు మాత్రం చాలా ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు.
ఆపరేషన్ అనంతరం రోగులను ఎక్కువరోజులు ఉంచుకోవాల్సి వస్తే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదన్న భావనతో ఆరోగ్యశ్రీలో ఎన్‌ప్యానల్ చేసుకోవడం లేదు.
ఆపరేషన్‌ను అనుసరించి ఆరోగ్యశ్రీలో రూ.20వేలు నుంచి రూ.50వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కర్నూలులోని 90 శాతం నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఇదే దందా కొనసాగుతోంది.
అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రోగులు అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.
No Headline
Comments
Please login to add a commentAdd a comment