ప్రభుత్వం డబుల్ గేమ్!
● గ్రూపు–2 మెయిన్స్ పరీక్షల
నిర్వహణపై అభ్యర్థుల ఆగ్రహం
● ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే
డ్రామా చేశారు
● అబద్ధాలు ఆడటంలో
బాబును మించిన లోకేష్ అని
వ్యాఖ్యానిస్తున్న అభ్యర్థులు
● ప్రభుత్వ తీరుతో నోటిఫికేషన్ రద్దు
అవుతుందని ఆవేదన
● పరీక్ష నిర్వహించినా ఫలితం
లేదంటూ వ్యాఖ్యానం
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడిందంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం ఆడియో రిలీజ్ ద్వారా సీఎం చంద్రబాబునాయుడు, ట్విట్టర్‌లో విద్యాశాఖమంత్రి లోకేష్ పెద్ద డ్రామా ఆడారని, తమను మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పే పోటీలో లోకేష్ ముందంజలో నిలిచారని పలువురు అభ్యర్థులు సైటెర్లు వేశారు.
డ్రామాను అర్థం చేసుకోలేని
అమాయకులమా?
గ్రూపు–2లో మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల్లో కొన్నింటికి సంబంధించి రోస్టర్ పాయింట్ల కేటాయింపులో లోపాలు ఉన్నాయి. వీటిని సరిచేసి మెయిన్స్‌ను నిర్వహించాలని అభ్యర్థులు దాదాపు నెల రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుంటామని శుక్రవారం మంత్రి లోకేష్ చెప్పగా.. సీఎం చంద్రబాబునాయుడు గ్రూపు–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శనివారం సాయంత్రం ఏపీపీఎస్‌సీకి లేఖ రాశారు. ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోలేమని ఏపీపీఎస్‌సీ చెప్పడం, పరీక్ష యథాతథంగా ఉంటుందని ప్రకటించడం పెద్ద డ్రామా అని అభ్యర్థులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి, మంత్రి డ్రామాలు ఆడారని, దానిని అర్థం చేసుకోలేని అమాయకులమా అని అభ్యర్థులు అంటున్నారు.
సమయానికి హాజరు కాలేక అవస్థలు
సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక కొంతమంది అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగిపోయారు. కర్నూలు ఏక్యాంపు మాంటిస్సోరి పాఠశాలలో రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారని నంద్యాలకు చెందిన రవూఫ్, చంద్రబాబు, ఆత్మకూరుకు చెందిర రమేష్‌లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో వెనక్కి వెళ్లారు. కాగా.. సుంకేసులరోడ్డులోని సెయింట్ జోసెప్ కాలేజీలో జరుగుతున్న పేపర్–1 పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వేర్వేరుగా పరిశీలించారు. ఏక్యాంపు మాంటిస్సోరి, ఇందిరాగాంధీ స్మారక నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల కేంద్రాలను జేసీ డాక్టర్ బి.నవ్య, జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటైన పరీక్షా కేంద్రాన్ని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించారు.
86.91 శాతం హాజరు
గ్రూపు–2 మెయిన్స్ పరీక్షల కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1 పరీక్షను నిర్వహించగా 9,993 మంది అభ్యర్థులకు గాను 8,693 మంది హాజరవ్వగా 86.99 శాతం నమోదైంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన పేపర్–2 పరీక్షకు 9,993 మందికిగాను 8,678 మంది అభ్యర్థులు హాజరవ్వగా 86.84 శాతం నమోదైంది. రెండు పరీక్షల్లో కలిపి 86.91 శాతం నమోదైంది.
ప్రభుత్వం డబుల్ గేమ్!
ప్రభుత్వం డబుల్ గేమ్!
Comments
Please login to add a commentAdd a comment