రమణీయం.. బ్రహ్మోత్సవం
● శ్రీగిరిలో నేత్రానందభరితంగా బ్రహ్మోత్సవాలు
● రావణవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం నీలకంఠుడు భ్రమరాంబా సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. తన తల్లి కై కసీ నుంచి శివభక్తిని పుణికిపుచ్చుకున్న అపర భక్తుడు రావణుడు సాక్షాత్తు పరమేశ్వరుడే తన వద్ద ఉండాలన్న తలంపుతో కై లాసాన్నే పెకిలించి తీసుకెళ్లే క్రమంలో స్వామివారికి వాహనుడయ్యాడని పండితులు చెబుతున్నారు. స్వామివారికి శాస్త్రోక్తంగా రావణవాహన సేవ నిర్వహించారు. రావణుడి భుజస్కందాలను అధిష్టించిన ఉత్సవమూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావణవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించిన అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. వేలాది మంది భక్తుల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవదాయవాఖ కమిషనర్ రామమోహన్ పట్టువస్త్రాలు తీసుకురాగా, ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు సోమవారం సాయంత్రం మల్లికార్జున స్వామికి పుష్పపల్లకీ సేవోత్సవం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment