అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఆదోని అర్బన్: ఆస్పరి మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన బోయ రాజు(33) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరేసుకుని మృతిచెందారు. హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి తెలిపిన వివరాలు.. పెద్దహుల్తి గ్రామానికి చెందిన భీమప్ప కుమారుడు బోయ రాజు ఆదోని ఆర్టీసీ బస్టాండు వద్ద దుకాణం బాడుగకు తీసుకుని బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజు భార్య భాగ్యమ్మ పుట్టినిల్లు కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా గ్రామంలో జరిగిన జాతరకు దంపతులు కలిసి వెళ్లారు. అక్కడ భార్య పుట్టినింట్లో గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి తిరిగి ఆదోనికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి అందరూ నిద్రించిన సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా తన కుమారుడి ఆత్మహత్యపై అనుమానం ఉందని తండ్రి భీమప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
దేవరకు వచ్చి..
ఆస్పరి: మద్దికెరకు చెందిన నెట్టేకంటయ్య (36) గ్రామ దేవతల దేవర నిమిత్తం ఆస్పత్రి మండలం ముత్తుకూరు గ్రామానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 17 నెట్టేకంటయ్య పెద్దమ్మవ్వ, సుంకులమ్మవ్వ దేవర నిమిత్తం ముత్తుకూరు గ్రామం లోని సోదరి ఇంటికి వచ్చాడు. 19న మధ్యాహ్నం వరకు సోదరి ఇంటి వద్దే ఉన్నారు. అనంతరం బయటకు వెళ్లి సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో సోదరి బంధువులు తెలిసిన చోటల్లా వెతికారు. స్వగ్రామంలోనూ ఆరా తీశారు. సోమవారం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి సోదరుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment