నంద్యాల(అర్బన్): నంద్యాల మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దకొట్టాల గ్రామంలో 2,200 కుటుంబాలు 1,250 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ ఊరిలో ఏళ్ల నుంచి సాగు, తాగునీటికి నేల బావులే ఆధారం. గతంలో బావుల నీటినే అన్ని పనులకు వినియోగించుకునే వారు. ఎప్పుడూ తాగునీటి ఎద్దడి ఉండేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో నివాసాల్లో బోర్లు వేసే ప్రయత్నాలు ఎన్నో సార్లు చేసినా వీలు కాలేదు. కాలక్రమేణా గ్రామస్తులు కొందరు తన నివాసాల్లో బావులు తవ్వుకున్నారు. ముందుగా తవ్విన వారి నివాసాల్లోని బావుల్లో ఎండాకాలంలోనూ బావి అడుగంటకుండా ఉండకపోవడం, నీరు తాగేందుకు మంచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లోనూ బావులు తవ్వించారు. మహిళలకు వీధి బావుల వద్ద నుంచి బిందెల మోత తప్పి, నివాసాల్లోని బావుల వద్దే నీటిని చేదుకునేవారు. అందరి నివాసాల్లో బావులకు మోటార్లు అమర్చుకుని తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా జీవించేవారు. దీంతో గ్రామంలో మొత్తం 70 నుంచి 80 దాకా నేల బావులు ఉండేవి. అనంతరం కాలంలో పొలాల సాగులో భాగంగా ప్రస్తుతం 60 నుంచి 70 దాకా నేల బావులున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆధ్వరంలో పలు కాలనీల్లో వాటర్ ట్యాంకులు, ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో పంచాయతీ ఆధ్వర్యంలో పైప్‌లైన్ల ద్వారా తాగునీరు వస్తుంది. నివాసాల్లో తవ్వుకున్న బావుల నుంచి నీటిని వాడకాలకు ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా పొలాల్లోని నేల బావుల నీరు సాగునీటికి ఉపయోగపడుతుంది.
తెలుగుగంగ, పాలేరు సాగునీటి రాకతో..
గ్రామం మీదుగా తెలుగుగంగ కాల్వ ఏర్పాటు కావడం, పాలేరు నీటిని పొలాలకు మళ్లించుకోవడంతో నేల బావుల నీటి వాడకం తగ్గింది. తెలుగుగంగ నీరు నీటితో వందలాది ఎకరాల్లో రెండు కార్ల పంటలు పండుతుండగా పాలేరు నీరు కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో నేల బావుల ఉపయోగంతగ్గింది.
కొంత మంది రైతులకు వాటితోనే వ్యవసాయం
నివాసాల్లో ఏర్పాటు చేసుకున్న నేల బావులు అత్యవసరాలకు ఉపయోగపడుతుండగా పొలాల్లో ఏర్పాటైన బావులు కొంత మంది రైతులకు సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. దాదాపు 350 ఎకరాల దాకా బావుల కింద పొలాలు సాగు అవుతున్నట్లు సమాచారం. వర్షాలు సకాలంలో కురవని సమయాల్లో నేల బావులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఏ కాలంలోనైనా బావుల్లో నీరు తగ్గే పరిస్థితి తలెత్తదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. జూన్, జూలై మాసాల్లో ఖరీఫ్ సాగుకు వర్షాలు కురియకపోతే వరి నారు మడులు మొత్తం బావుల కిందనే సాగవుతాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే తప్ప పంటలు పండకపోవడం జరగదని రైతులు ధీమాగా చెబుతున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత అదే భూముల్లో మళ్లీ దుక్కి దున్ని మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కొంత మంది రైతులు కూరగాయలు పండించుకుంటున్నారు.
పొలంలో ఏర్పాటు చేసుకున్న నేల బావి
Comments
Please login to add a commentAdd a comment