కంటైనర్‌లో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు!
● హర్యానా ముఠా గుట్టు రట్టు
● చిన్నటేకూరు ఏటీఎం దోపిడీకి
యత్నించింది వీరే
● సాంకేతిక పరిజ్ఞానంతో
నలుగురు అరెస్టు
కర్నూలు: నలుగురు సభ్యుల ముఠా... అందరిదీ హర్యానా. వృత్తిరీత్యా డ్రైవర్లు కావడంతో కంటైనర్‌లో అన్ని రాష్ట్రాల్లో తిరుగుతుంటారు. మార్గమధ్యలో చోరీకి అనుకూలంగా ఉన్న ఏటీఎం కేంద్రాలను గుర్తించి దోపిడీలకు పాల్పడుతారు. ఈ అంతర్‌రాష్ట్ర ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌తో కలసి ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఎన్‌హెచ్44 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టేందుకు గత నెల 24వ తేదీ రాత్రి యత్నించారు. షట్టర్ పెకిలించి ఏటీఎం మిషన్‌కు తాడుతో కట్టి టోయింగ్ (వాహనాలను తరలించే) వాహనంతో లాక్కునిపోవడానికి యత్నించారు. అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. యువకులు చూస్తున్నారని దొంగలు పసిగట్టి ఏటీఎం మిషన్‌ను వదిలేసి టోయింగ్ వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు.
రంగంలోకి దిగిన పోలీసులు...
బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగి పక్కా ఆధారాలతో హర్యానా రాష్ట్రం నూహ్‌మేవత్ జిల్లా రాయపురి గ్రామానికి చెందిన షాహిద్ ఖాన్, పాల్వాల్ జిల్లా మమ్ముల్కా గ్రామానికి చెందిన సున్ని ఇమ్రాన్ ఖాన్, మేవాత్ జిల్లా రాయపురి గ్రామానికి చెందిన జంషాద్ ఖాన్, షావ్కర్ ఖాన్‌లను చెట్లమల్లాపురం గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్44 పక్కన గల సంరాతల్ రాజస్థాన్ డాబా దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. చిన్నటేకూరు దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంతో పాటు అంతకుముందు రోజు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో కూడా తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించారు. అలారం మోగడంతో పారిపోయినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దోపిడీ కోసం బళ్లారి చౌరస్తా సమీపంలో ఒక టోయింగ్ వాహనాన్ని చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లుగా అంగీకరించారని ఎస్పీ తెలిపారు. షాహిద్ ఖాన్‌పై 26, ఇమ్రాన్ ఖాన్‌పై 15 ఏటీఎం చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక గ్యాస్ కట్టర్ , చిన్న గ్యాస్ సిలిండర్, రెండు కత్తులు, తాళాలు తెరవడానికి ఉపయోగించే మారు తాళాలు, మాస్కులు, గ్లౌజులు, రెండు స్ప్రే టిన్ లు, కూలింగ్ అద్దాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు...
చోరీ చేసిన టోయింగ్ వాహనంపై లభించిన ఆధారాలతో పాటు ఏటీఎం కేంద్రం దగ్గర ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించారు. వారు వినియోగించిన సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా కంటైనర్ వాహనం ద్వారా బెంగుళూరు వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. సీఐలు చంద్రబాబు నాయుడు, శేషయ్య, వంశీధర్, వేణుగోపాల్, ఎస్‌ఐలు ధనుంజయ, సునిల్ తదితరులు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
సిబ్బందికి నగదు రివార్డు
పది రోజుల వ్యవధిలోనే ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని నగదు రివార్డుతో ఎస్పీ సత్కరించారు. ఈ కేసులో నలుగురు దొంగలను అరెస్టు చేసిన కర్నూలు డీఎస్పీ, సీఐలతో పాటు బృందంలోని సభ్యులు డి.శేఖర్ బాబు, వాసు, షమీర్, నాగరాజు, శ్రీనివాసులు, శేఖర్, రవి, సైబర్ ల్యాబ్ పీసీ రాజేష్ తదితరులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment