అదనపులోడు క్రమబద్ధీకరణకు 50 శాతం రాయితీ
కర్నూలు(అగ్రికల్చర్): గృహ విద్యుత్ వినియోగంలో అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఇ ఉమాపతి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గృహ వినియోగానికి సంబంధించి చాలా వరకు మొదట ఒక కిలో వాట్ లోడ్‌తోనే కనెక్షన్ తీసుకుంటారని, అయితే ఆ తర్వాత ఏసీలు, ఇతరత్రా వాటితో లోడు రెండు, మూడు కిలో వాట్స్‌కు పెరుగుతుందన్నారు. వినియోగించిన విద్యుత్‌కు వినియోగదారులు చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడు పెరుగుతుండటం వల్ల కాలిపోవడం, లో ఓల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకుంటే ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అదనపు లోడు క్రమబద్ధీకరణకు డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన రుసుములో 50 శాతం రాయితీతో ఏపీఎస్‌పీడీసీఎల్ వెబ్‌సైట్ www.apspdcl.on, సమీపంలోని మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశం జూన్ 30 వరకు ఉందన్నారు.
తమ్ముళ్లా.. మజాకా!
నందవరం: తెలుగు తమ్ముళ్లు ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతున్నారు. ఓ వైపు అధికారులు వలసల నివారణకు ఉపాధి పనులు కల్పిస్తున్నామని చెబుతుండగా.. మరో వైపు టీడీపీ నాయకులు యంత్రాలతో పనులు చేపడుతుండటం గమనార్హం. కూలి గిట్టుబాటు కాగా ఎంతో మంది పేదలు పొట్ట చేతబట్టుకుని వలసబాట పడుతున్నారు. ఊర్లో కొందరికై నా ఉపాధి కల్పించాల్సిన పనులు యంత్రాలతో చేపట్టంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోనకలదిన్నె గ్రామంలో ఫారం పాండ్ పనులను తెలుగు దేశం పార్టీ నేతలు జేసీబీతో చేయిస్తున్నారు. గురువారం గ్రామంలోని దైవందిన్నె రోడ్డులో మూల్లా కాజావలి అనే రైతు పొలంలో జేసీబీతో చేపట్టారు. కనీసం రైతుకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఉపాధి కూలీలకు కడుపు కొట్టి యంత్రాలతో పని చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉపాధి కూలీలకు వాటర్ బెల్
● డ్వామా పీడీ వెంకటరమణయ్య
కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉపాధి కూలీల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట రమణయ్య తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులకు ఉదయం 6 గంటలలోపే పని ప్రదేశానికి హాజరై 11 గంటలకు ముగించుకునే విధంగా ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత పెరుగకముందే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పనులు చేసుకొని గరిష్ట వేతనం రూ.300 పొందవచ్చని సూచించారు. పని ప్రదేశాల్లో కూలీలకు నీటి వసతి కల్పించాలని, ప్రతి గంటకు నీరు తాగే విధంగా వాటర్ బెల్ పద్ధతిని అమలు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి కూలీలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న షేడ్స్‌ను వినియోగించాలని, లేకపోతే స్థానికంగా లభించే తాటాకు, ఈతాకు తదితర వాటితో పందిరి వేసే విధంగా సూచించామన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment