బనగానపల్లెలో భారీ చోరీ
బనగానపల్లె రూరల్: పట్టణంలోని శివరామ్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 16 తులాల బంగారం, రెండు కేజీ వెండి ఆభరణాలతోపాటు రూ.4 లక్షల నగదుతో ఉడాయించారు. బాధితుడు తెలిపిన వివరాలు.. సత్యనారాయణ కుటుంబం రెండు రోజు క్రితం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారు, ఆభరణాలు, నగదును మూటగట్టుకుని పరారయ్యారు. ఇంటి తలుపులు తెరిచి ఉంచినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ తిరిగి ఇంటికి వచ్చి చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నంద్యాల క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
భర్త చేతిలో భార్య దారుణ హత్య
● రోకలి బండతో తలపై దాడి ● ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి
కొలిమిగుండ్ల: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్తే భార్యను కర్కషంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం బెలుం శింగవరంలో చోటుచేసుకుంది. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి, మనోహరమ్మ(37)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. 13 ఏళ్ల కుమారుడు ప్రతాప్‌రెడ్డి ఉన్నాడు. వీరి స్వగ్రామం వైఎస్సార్ కడప జిల్లా కొండసుంకేసుల కాగా బెలుం శింగవరంలో స్థిరపడ్డారు. మొదట్లో నాపరాతి గని తీసుకొని జీవనం సాగిస్తుండేవాడు. తర్వాత మద్యానికి బానిసై, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య వ్యవసాయ కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండేది. రోజు మాదిరిగా కూలీ పనులు ముగించుకుని ఇంటికి చేరుకొని కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్లగానే తలుపులు మూసి.. అప్పటికే పథకం ప్రకారం సిద్ధంగా ఉంచుకున్న రోకలిబండతో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో బంధువులు చికిత్స నిమిత్తం అవుకు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ బెలుం శింగవరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment