
ముట్టుకుంటే షాక్
● విద్యుత్ వినియోగదారుల
నిలువు దోపిడీ
● 2022, 2023, 2025
సంవత్సరాల్లో వాడిన విద్యుత్‌కు
ప్రతి యూనిట్‌పై 40పైసల వడ్డింపు
● ట్రూ అప్ చార్జీలతో
మరో అదనపు భారం
● బిల్లులను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై టీడీపీ, జనసేనలు చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. అడ్డుగోలుగా చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నారని ప్రజలను నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం తెలిసిందే. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి నియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపం, చార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోమనే ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు అన్ని వర్గాల వారిపై మోపిన విద్యుత్ చార్జీల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీల భారం ఈ స్థాయిలో ఉంటే, రానున్న నాలుగేళ్లలో పరిస్థితి ఊహించుకుంటేనే షాక్ కొడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా.. ఒక్కరోజు ఆలస్యమైతే చాలు సర్‌చార్జీ పేరిట జరిమానా విధిస్తున్నారు. మళ్లీ సర్దుబాటు తదితర పేర్లతో 2022, 2023 సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్‌కు కూడా నేడు చార్జీ వేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభుత్వ ‘షాక్’ ఇలా
వినియోగదారుడు ఒక నెలలో 125 యూనిట్లు వినియోగిస్తే మొదటి మూడు శ్లాబ్‌ల ప్రకారం బిల్లు రూ.417 వస్తుంది. దీనికి కస్టమర్ చార్జీ రూ.45, ఫిక్స్‌డ్ చార్జీ రూ.20, ఈడీ చార్జీ రూ.7.50 వసూలు చేస్తారు. అన్నీ కలిపి 125 యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు రూ.489.5 మాత్రమే. ఇదే 125 యూనిట్లకు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం రూ.850. అంటే బిల్లుపై అదనంగా రూ.361 భారం మోపుతోంది. విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ భారం తడిచి మోపెడవుతుంది.
భారం ఇలా పడుతోంది..
విద్యుత్ చార్జీల భారం వివిధ రూపాల్లో పడుతోంది. 2022, 2023, 2025 సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు పేరుతో ఎఫ్‌పీపీసీఏ వసూలు చేస్తున్నారు. ఆయా సంవత్సరాల్లో నెల వారీగా వినియోగించిన యూనిట్లపై 40 పైసల ప్రకారం భారం పడుతోంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజలను ఈ చార్జీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
సగటున ప్రతినెలా రూ.95కోట్లకు పైనే భారం
సంక్షేమ పథకాల ఊసే లేకపోవడం వల్ల ప్రజల్లో నగదు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ పేదరికం పురుడుపోసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల హామీలను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పేరిట అదనపు భారం మోపుతోంది. ఉమ్మడి జిల్లాలో 15.85 లక్షల గృహ విద్యుత్ కలెక్షన్‌లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ.600 అదనపు భారం లెక్కకట్టినా ప్రతి నెలా రూ.95కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తుండటం గమనార్హం.
రూ.542 అదనపు బిల్లు
ఫిబ్రవరి నెలలో 145 యూనిట్లు వినియోగించాం. విద్యుత్ చార్జీ రూ.537 వచ్చింది. ఫిక్స్‌డ్ చార్జీ రూ.50, కస్టమర్ చార్జీ రూ.50 వేశారు. మామూలుగా అయితే రూ.637 బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎఫ్‌పీపీసీఏ రూ.307.07, 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.166.20, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.59.60, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.8.70 ప్రకారం అదనపు భారం పడింది. మొత్తంగా వచ్చిన బిల్లు రూ.1,179.
– బి.నాగలక్ష్మి, కర్నూలు

ముట్టుకుంటే షాక్
Comments
Please login to add a commentAdd a comment