
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత చదువులు రోజు రోజుకు భారమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పేద విద్యార్థులు సాంకేతిక విద్య వైపు అడుగులు వేస్తే భవిష్యత్ బంగారు బాట అవుతుంది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య పూర్తి చేసి ఆ తర్వాత దాని పునాదిగా చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందు కోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకుని జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్–2025 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువు ప్రకటించలేదు.
కోర్సులు ఇలా...
ప్రస్తుతం సరికొత్త కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులోకి తెచ్చాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 30, మెకానికల్ 30 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రెన్స్‌లో క్వాలిఫై మార్కులు 35గా నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా..
పాలిసెట్ ఎంట్రెన్స్‌ను 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు.
పాలిటెక్నిక్ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఏప్రిల్ 30న పాలిసెట్
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్–2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు, సంబంధిత మెటీరియల్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శ్రీనివాసప్రసాద్,
పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల
విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..
పాలిటెక్నిక్‌లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్ లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
Comments
Please login to add a commentAdd a comment