పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు
శిరివెళ్ల: యర్రగుంట్ల 2వ గ్రామ సచివాలయ గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న పీరయ్య గురువారం తెలిపారు. గతంలో కార్యదర్శి సామాజిక పింఛన పంపిణీ అనంతరం మిగిలిన రూ. 8.48 లక్షలను తిరిగి ఏంపీడీఓ కార్యాలయానికి అప్పగించలేదు. పింఛన్ల డబ్బులు చెల్లించక పోవడంపై ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు నిందితులకు జైలు శిక్ష
నంద్యాల (వ్యవసాయం): హత్యాయత్నం, దాడి కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి గురువారం తీర్పునిచ్చారు. పాణ్యం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల గ్రామానికి చెందిన సందొలి అంజి, మాదిగ హరినాథ్‌లో ఒకరు పాణ్యం మండలం తమ్మరాజుపల్లికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో మహిళ అత్త శివమ్మ గుర్తించి హెచ్చరించింది. అయితే నిందితులిద్దరూ 2017 ఏప్రిల్‌లో శివమ్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
కారు బోల్తా
చాగలమర్రి: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై నగళ్లపాడు గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. బనగానపల్లెకు చెందిన నలుగురు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి భవనాసి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజారెడ్డి, హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా సిబ్బంది ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చాగలమర్రి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
8 నెలలుగా గైర్హాజరు
● ఉపాధ్యాయుడికి నోటీసులు
జారీ చేసిన ఎంఈఓలు
హొళగుంద: హొన్నూరు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శివశంకర్‌రెడ్డి ఎనిమిది నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలకు డీఈఓ దృష్టికి తీసుకెళ్లి నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ–1, 2 సత్యనారాయణ, జగన్నాధం గురువారం విలేకరులకు తెలిపారు. కడపకు చెందిన శివశంకర్‌రెడ్డి 2023లో విధుల్లో చేరారని, 2024 జూలై 5వ తేదీ నుంచి గైర్హాజరవుతున్నారన్నారు. షోకాజ్ నోటీసులు, మెమోలు పోస్ట్ ద్వారా ఆయన ఇంటికి పంపినా ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. విద్యాశాఖాధికారులకు నివేదిక చేయని పక్షంలో ప్రభుత్వ నియామవళి ప్రకారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈఓలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment