
గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌసింగ్ ఇంజినీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారుని ఇంటింటికి వెళ్లి అదనపు ఆర్థిక సహాయం గురించి తెలియజేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బంది సంబంధిత లాగిన్‌లో వివరాలు పొందుపరిచి లబ్ధిదారులతో జియో టాగింగ్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లాకు 21,711 గృహాలు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులకు గతంలో ఒక యూనిట్‌కి రూ. 1.80 లక్షల రూపాయలు వచ్చేదన్నారు. వీటికి అదనంగా ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేలు, పీవీటీజీలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. జిల్లాలో గృహాలు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీల లబ్ధిదారులకు రూ. 114.24 కోట్ల అదనపు సాయం అందుతుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 7,069 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యంలో భాగంగా ప్రతి రోజు ప్రతి మండలంలో మూడు గృహాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ మేర పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ 2.29 లక్షల రూపాయలకు అదనంగా మరో లక్ష రూపాయలు అదనపు సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ శ్రీహరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎండలో ఎక్కువగా
తిరగొద్దు
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ
కర్నూలు (హాస్పిటల్): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండల్లో ఎక్కువ తిరగరాదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటల లోపు తమ పనులు ముగించుకుని నీడ గల ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు. ఎండలో తప్పరిసరిగా తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలన్నారు. వెంట నీళ్ల బాటిల్ ఉంచుకుని గంటగంటకూ తాగుతూ ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసహాయం అందేలా చూడాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అన్ని సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలన్నారు.

గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం
Comments
Please login to add a commentAdd a comment