కర్నూలు: కృష్ణ వర్ష పొదుపు సంఘంలో రూ.8 లక్షలు అప్పు తీసుకుని ప్రతి నెలా కంతులు చెల్లించాం. పొదుపు సంఘంలోని లీడర్లు ఆ డబ్బును బ్యాంకుకు చెల్లించకుండా మోసం చేశారని, బ్యాంకు నుంచి తమకు నోటీసులు వచ్చాయని కర్నూలు నిర్మల్ నగర్‌కు చెందిన పల్లవి, రషీద, విజయలక్ష్మి, మరికొంతమంది పొదుపు సంఘం సభ్యులు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాతో పాటు సీఐలు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● నీటిపారుదల శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన సూర్యమాధవ రావు రూ.6.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● వాటర్ ప్లాంట్ ఫిట్టింగ్ చేస్తానని చెప్పి రూ.లక్ష తీసుకుని కర్నూలుకు చెందిన వారిషా వాటర్ టెక్స్ మున్నా మోసం చేశాడని కర్నూలు మద్దూర్ నగర్‌కు చెందిన రామ్మూర్తి ఫిర్యాదు చేశారు.
● నా పెద్ద కుమారుడు ఇల్లు రాసివ్వాలని ఇంటి కొళాయి పన్నులు కట్టకుండా ఇంటి పట్టా తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కర్నూలు కొత్తపేటకు చెందిన సుంకులమ్మ ఫిర్యాదు చేశారు.