
చిర్తనకల్లులో రేషన్ బియ్యం పంపిణీ
కోసిగి: మండల పరిధిలోని చిర్తనకల్లు గ్రామంలో దాదాపు 110 మంది కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా కోటా అయిపోయిందంటూ డీలర్ చేతులెత్తేశాడు. బాధితుల ఆవేదనను ఈ నెల 6వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘రేషన్.. పరేషాన్’ పేరిట కథనం ప్రచురించి వెలుగులోకి తెచ్చింది. ఇందుకు స్పందించిన తహసీల్దార్ రుద్రగౌడ, ఆర్‌ఐ శ్రీరాములు, వీఆర్వో రామాంజనేయులు గ్రామానికి చేరుకుని డీలర్ వద్ద రేషన్ బియ్యం కోటాపై విచారణ చేపట్టారు. నెలకొకరు చొప్పున డీలర్ మారుతూ బియ్యం పంపిణీ చేస్తుండడంతో బ్యాక్‌లాగ్ కోటాను ఎవరికి వారే కాజేశారు. దీంతో ఈ నెలలో 110 మంది రేషన్ కార్డుదారులకు బియ్యం తక్కువ వచ్చింది. దీంతో డీలర్లపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న మరో రేషన్ డీలర్ వద్ద నుంచి ఎండీయూ వాహనంలో బియ్యం తీసుకొచ్చి పోర్టబుల్ కింద చిర్తనకల్లు గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. రేషన్ బియ్యం అందడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

చిర్తనకల్లులో రేషన్ బియ్యం పంపిణీ