
అర్ధరాత్రి ఆదోని ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
ఆదోని అర్బన్: పట్టణంలో బీజేపీ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే పీఏ అని, అనుచరులమని దాదాపు 10 మంది ఇసుక టిప్పర్, ట్రాక్టర్‌లను ఆపి దౌర్జన్య చేస్తున్నారు. లోడింగ్ రశీదులను చింపేసి ఎమ్మెల్యేను కలవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ట్రాక్టర్ ఓనర్ కృష్ణ, టిప్పర్ డ్రైవర్ మహమ్మద్‌హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో డస్ట్ తీసుకెళ్తున్న లారీని ఆపి దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి 11 గంటలకు ఎమ్మెల్యే అనుచరులు సాయి, తాయన్న, రమాకాంత్, విజయ్‌లతోపాటు మరో ఆరుగురు టిప్పర్‌లను, ట్రాక్టర్‌లను ఆపి నెలకు ట్రాక్టర్‌కు రూ.15 వేలు, టిప్పర్‌కు రూ.40 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే అక్రమ రవాణా, ఇసుక మాఫియాను నియంత్రించేందుకే బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజుగౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ్‌కృష్ణ జరిగిన ఘటనలను సమర్థించుకోవడం గమనార్హం. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
టిప్పర్‌కు రూ.40 వేలు, ట్రాక్టర్‌కు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్