
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● ఎన్‌హెచ్–44పై బోల్తాపడిన కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ● దంపతుల దుర్మరణం, మరో నలుగురికి గాయాలు ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● మృతులు బండి ఆత్మకూరు మండలం కాకునూరు వాసులు
ఎర్రవల్లి/బండిఆత్మకూరు: అతివేగం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడటం.. అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్‌ఐ మురళి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకునూరుకు చెందిన దేరెడ్డి పుల్లారెడ్డి (59), ఆయన భార్య లక్ష్మి పుల్లమ్మ (51), కుమారుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో దేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి పుల్లమ్మతో పాటు వారి బంధువు స్రవంతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు తేలికపాటి రక్త గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికి త్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే సుబ్బారెడ్డి, లక్ష్మిపుల్లమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుల బంధువు మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.