వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 స్థాయిలో బది‘లీలలు’ జరిగాయి. పదేండ్లకు పైబడి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం కల్పించేందుకు చేపట్టిన బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో నచ్చిన దగ్గర పోస్టింగ్ పొందినట్లు రిజిస్ట్రేషన్ శాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బదిలీలు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులను బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ నవీన్ మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ డీఐజీగా – ఎం.సుభాషిణి
మహబూబాబాద్–తస్లీమా మహమ్మద్
జనగామ–టి.సంపత్‌కుమార్
వరంగల్ రూరల్–మసీయుద్దీన్
వరంగల్ ఫోర్ట్– ఏ.కార్తీక్
వరంగల్ ఆర్వో–ఎండీ.అమ్జద్ అలీ
నర్సంపేట– రామ కిశోర్ రెడ్డి
డీఐజీ కార్యాలయం–డి.సుజాత
ఎట్టకేలకు కదిలారు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏండ్లుగా లాంగ్ స్టాండింగ్‌లో విధులు కొనసాగిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఎట్టకేలకు బుధవారం వెలువడిన బదిలీలతో కదిలారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా దాటని సబ్‌రిజిస్ట్రార్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాంగ్‌స్టాండింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులు మల్టీ జోన్–1లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల అండతో ఉమ్మడి వరంగల్ జిల్లా దాటకుండా తాము ఎంచుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గ్రేడ్–1,గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు మ్యూచువల్‌ను తలపించాయి.
వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్ జనగామ, జనగామలో విధులు నిర్వహిస్తున్న అమ్జద్‌అలీ వరంగల్ ఆర్వో, ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహబూబాబాద్, వరంగల్ ఫోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న మసీయుద్దీన్ వరంగల్ రూరల్, వరంగల్ రూరల్‌లో విధులు నిర్వహిస్తున్న సుజాత డీఐజీ కార్యాలయానికి , నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్న కార్తీక్ వరంగల్ రూరల్‌కు కేటాయించారు. ఈ విధంగా ఏ అధికారి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా దాటలేదు.
చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పి ఉమ్మడి వరంగల్ దాటకుండా అడ్డుపడ్డారని తెలుస్తోందని పలువురు పేర్కొన్నారు. భారీగా బదీలీలు జరుగుతాయనే సమచారంతో లాంగ్ స్టాండింగ్ గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు లాంగ్ లీవ్ పెట్టి హైదరాబాద్‌కు మకాం మార్చి ఉన్నతాధికారుల అధికారుల ఆశీర్వాదం కోసం ఉద్యోగ సంఘాల నేతలతో జతకట్టారు.
Comments
Please login to add a commentAdd a comment