లోహిత్
10, 11 తేదీల్లో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్న లోహిత్
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కురవి: ఆ విద్యార్థి.. హోమియోపతి వైద్య విద్యనభ్యసిస్తూ మెదడుకు పదును పెట్టాడు.. మిత్రులకన్నా ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుకోవాలనే తపన మొదలైంది. గైడ్‌టీచర్ సహకారంతో నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాడు.. ఎంచుకున్న తన గ్రంథాన్ని పూర్తి చేశాడు.. ఏకంగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకునే గౌరవం పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లికి చెందిన జంగం సామ్రాజ్యం, రవి దంపతుల కుమారుడు లోహిత్ సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ హోమియోపతి మెడికల్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
షార్ట్‌టర్మ్ స్టూడెంట్‌షిప్ ఇన్ హోమియోపతి విభాగంలో ఆరు నెలలుగా ‘ఆగ్రో హోమియోపతి’ అనే అంశంపై రీసెర్చ్ చేస్తున్నాడు. గైడ్ టీచర్ శ్రీవిద్య సూచనల మేరకు లోహిత్.. రీసెర్చ్ పూర్తి చేశాడు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి ఆధ్వర్యంలో లోహిత్ గ్రంథానికి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతులమీదుగా ఈనెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో లోహిత్ అవార్డు అందుకోనున్నాడు. కాగా, ఈ అవార్డు తన తల్లిదండ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్‌లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తానని లోహిత్ తెలిపారు. తన కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందం కలిగించిందని రవి తెలిపారు. లోహిత్‌కు అవార్డు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment