వరంగల్: సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో జారీ చేసిన టీఆర్(టెంపరరీ రిజిస్ట్రేషన్)లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ప్రస్తుతం అమలవుతున్న ఓటీపీ పద్ధతికి స్వస్తి పలికి వేలి ముద్రల(బయోమెట్రిక్) సేకరణ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈనెల మొదటి వారంలో సాంకేతికపరమైన లోపాల కారణంగా సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈక్రమంలోనే టీఆర్‌ల విషయం వెలుగు చూడడంతో బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తూ ఈనెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. వేలి ముద్ర గుర్తింపు కాని సమయంలో ఐరిస్ గుర్తింపు తీసుకుంటున్నారు. దీంతో రైతులు పత్తి విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు తప్పనిసరి రావాల్సి వస్తోంది.
దళారులకు చెక్..
బయోమెట్రిక్ విధానంతో దళారులకు చెక్ పెట్టినట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. గతంలో కౌలు రైతులు పత్తి విక్రయించేందుకు వ్యవసాయశాఖ ధ్రువీకరించిన టీఆర్ తీసుకువస్తే మార్కెటింగ్‌శాఖలో రిజిస్టరైన రైతుకు ఓటీపీ వెళ్లేది. సదరు రైతు ఓటీపీని ఒకే చేస్తే సీసీఐ ఆరైతు తెచ్చిన పత్తి కొనుగోలు చేసేది. ప్రస్తుతం టీఆర్‌లను పరిగణనలోకి తీ సుకోకపోవడంతో సీసీఐ విక్రయ కేంద్రానికి తప్పనిసరిగా రైతులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేడు టీఆర్‌ల అప్పగింత..!
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో జారీ చేసిన 46 వేల టీఆర్(టెంపరరి రిజిస్ట్రేషన్)లను సోమవారం (నేడు) రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయంలో అప్పగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీఆర్‌లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఈవ్యవహారంలో సంబంధం ఉన్న డీఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్)లపై వేటు పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో వరంగల్ మార్కెట్ కమిటీ పరిధిలో ఇద్దరు ముగ్గురిపై వేటు పడుతుందని తెలిసింది.
కౌలు రైతులకు ఇబ్బందులు..
పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టీఆర్‌లను సాకుగా చూపి అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్న అభిప్రాయాలను రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సీసీఐ కొనుగోలు చేసిన పత్తి డబ్బులు రైతుల ఖాతాల్లోనే పడ్డాయని, వాటిని సొంతానికి వాడుకోవడంతో కొంత మంది కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా సీసీఐ 80 లక్షల బేళ్ల పత్తి కొనుగోళ్లు చేయగా.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 40 లక్షల బేళ్ల పత్తి సేకరించినట్లు చెబుతున్నారు. సస్పెన్షన్ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పత్తి కొనుగోళ్లలో బయోమెట్రిక్ అమలు
సాంకేతిక లోపంతో ఐరిస్‌తో గుర్తింపు
దళారులకు చెక్ పెట్టిన సీసీఐ,
మార్కెటింగ్‌శాఖ
నేడు రాష్ట్ర కార్యాలయంలో
టీఆర్‌ల అప్పగింత
ఓటీపీ వద్దు.. వేలి ముద్రే ముద్దు
Comments
Please login to add a commentAdd a comment