ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం
గార్ల: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య ఆరోపించారు. ఆదివారం స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పీఎం నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించిందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఓటు క్రాస్ చేసి 8 ఎంపీ సీట్లు గెలవడానికి కారకుడైన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వామపక్షాలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వంపై క్షేత్రస్థాయి నుంచే తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని, ఎన్నికల హామీలను అమలు చేయకుంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చమరగీతం పాడేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు సీపీఎం శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, మండల కార్యదర్శి అలువాల సత్యవతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాసరావు, వి.పెద్దవెంకటేశ్వర్లు, అంబటి వీరస్వామి, ఇమ్మడి గోవింద్, కె.ఈశ్వర్‌లింగం, ఎం.నాగమణి, టి.రమ, బి. ఉపేందర్‌రెడ్డి, మౌనిక, బి.లోకేశ్వరరావు, కె.రామకృష్ణ, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య
Comments
Please login to add a commentAdd a comment