తెల్లవారుజామున చోరీ.. మధ్యాహ్నం రికవరీ
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరుగగా మధ్యాహ్నం వరకే పోలీసులు రికవరీ చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మానుకోట పట్టణంలోని ఇన్ కేబుల్ వీధిలో నివాసం ఉండే కొండ్లె శ్రీను, సాయిప్రసన్న దంపతులు శనివారం రాత్రి గాలి కోసం తమ ఇంటి ముందు తలుపులను దగ్గరకు పెట్టి , మెష్ డోర్ వేసుకుని నిద్రించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, రూ.5 వేల నగదు అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు టౌన్, సీసీఎస్ పోలీసులు నాలుగు టీంలుగా విడిపోయి ఇన్ కేబుల్ వీధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో పాత నేరస్తుడైన కోట్ల ముత్యాలరావు శనివారం రాత్రి ఆ బజారులో తిరిగినట్లుగా గుర్తించారు. వెంటనే అతడు దర్గాతండాలో ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు. ఈమేరకు ఆయన నేరం ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే ఛేదించి నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, సీసీఎస్ ఎస్సైలు తాహెర్ బాబా, బైరు గోపి, టౌన్ ఎస్సైలు బి. విజయ్ కుమార్, కే.శివ, టౌన్, సీసీఎస్ సిబ్బంది రమేశ్‌చందర్, గౌతమ్, సక్రాం, బాలు, క్రాంతిని ఎస్పీ అభినందించారు. కాగా ఈ చోరీ ఘటనలో నిందితుడి ఆనవాళ్లు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా పుటేజీల్లో నిక్షిప్తం కావడం వల్ల అతడిని వెంటనే పట్టుకునేందుకు అవకాశం లభించింది. ప్రతీ ఒక్కరు తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.
కేసును ఛేదించిన టౌన్, సీసీఎస్ పోలీసులు
నిందితుడిని పట్టించిన సీసీ కెమెరాలు
Comments
Please login to add a commentAdd a comment