
తెలుగుదనం ఉట్టిపడేలా..!
● పంచెకట్టు..లాల్చీతో వెంకట కమలాకర్
గీసుకొండ: తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, లాల్చీతో సంప్రదాయానికి బ్రాండ్‌గా నిలుస్తున్నారు గీసుకొండ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆసూరిమరింగంటి వెంకట కమలాకర్. అధికారుల సమీక్షలు ఉన్నా, మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సమావేశాల్లోనూ ఆయన డ్రెస్ కోడ్ భిన్నంగా ఉంటుంది. నిలువుబొట్టు, పంచెకట్టు, లాల్చీతోపాటు పిలకజుట్టుతో ప్రత్యేకంగా ఉంటారు. బ్రాహ్మణీయ వైష్ణవ కుటుంబంలో పుట్టిన ఆయన కృష్ణతత్వం వైపు ఆకర్షితులై తన జీవన విధానాన్ని మలుచుకున్నారు. ఎవరితోనైనా ప్రశాంతంగా, సౌమ్యంగా మాట్లాడటం ఆయన తీరు. పాఠశాల, కళాశాలలో చదువుకునేటప్పుడు ప్యాంట్, షర్టు వేసుకున్నా.. 1994లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆయన డ్రెస్‌కోడ్ పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక ప్రపంచంలో ఇలా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు.