మూడు మిల్లులకే అర్హత | - | Sakshi
Sakshi News home page

మూడు మిల్లులకే అర్హత

Published Wed, Apr 16 2025 11:24 AM | Last Updated on Wed, Apr 16 2025 11:24 AM

మూడు

మూడు మిల్లులకే అర్హత

సాక్షి, మహబూబాబాద్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం సేకరణకు ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించింది. పలుచోట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. అయితే ధాన్యం ఎగుమతి చేసేందుకు సివిల్‌ సప్లయీస్‌ జిల్లా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మూడు మిల్లులకు మాత్రమే దిగుమతి అనుమతులు వచ్చాయి. మెజారిటీ మిల్లులు అర్హత పొందకపోవడంతో ధాన్యాన్ని ఎటు పంపాలని అధికారులు సతమతమవుతున్నారు.

మూడు మిల్లులకే..

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ముందుగా జిల్లాలోని మిల్లులకు ఎగుమతి చేస్తారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు మూడు మిల్లులు మాత్రమే యాసంగి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అర్హత పొందాయి. గత అనుభవాల దృష్ట్యా ధాన్యం దిగుమతి కోసం వానాకాలం నుంచి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. జిల్లాలో మొత్తం 66 రైస్‌ మిల్లులు ఉండగా గతంలో తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్‌ పెట్టలేదని కొన్ని మిల్లులపై కేసులు కూడా పెట్టారు. మిగిలిన మిల్లుల్లో ప్రభుత్వం నిర్దేశించిన 10శాతం డిపాజిట్‌ కట్టేందుకు వెనకడుగు వేశారు. మొత్తంగా గత వానాకా లం 16మిల్లుల యజమానులు డిపాజిట్‌ చెల్లించారు. అలాగే 23మిల్లులు షూరిటీలు ఇచ్చాయి. ఈ మిల్లులన్నీ కలిపి 1.55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నాయి. ఇందుకు గాను 87,887 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ పెట్టాలి. ఇప్పటి వరకు 52,155 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ పెట్టగా.. మరో 35,734 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ పెట్టాల్సి ఉంది. ఈ మేరకు సకాలంలో సీఎంఆర్‌ పెట్టి, డిపాజిట్‌ చెల్లించిన మూడు మిల్లులు మాత్రమే యాసంగి ధాన్యం తీసుకునేందుకు అర్హత సాధించాయి.

అకాల వర్షాలతో భయం

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే సకాలంలో కొనడం, కాంటాలు పెట్టడం, లారీలకు ఎత్తేవరకు రైతు భయపడుతూనే ఉంటాడు. ఎప్పుడు వర్షం వస్తుందో.. గాలిదుమారంతో ఏం జరుగుతుందోన ని ఉత్కంఠగా ఉంటారు. కాగా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ జిల్లాలో మూడు మిల్లులకే దిగుమతి అనుమతి రాగా మిగిలిన ధాన్యం ఎటు పంపించాలనేది చర్చగా మారింది. ఇందుకోసం సీఎంఆర్‌ త్వరగా పెట్టాలని, డిపాజిట్‌ చెల్లిస్తే ధాన్యం పంపిస్తామని మిల్లర్లతో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే అధికారుల మాట విని సీఎంఆర్‌ పెట్టేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు మాత్రం డిపాజిట్‌ చెల్లించడం, లేదా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి ధాన్యం తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే యాసంగి ధాన్యం నూక ఎక్కువ వస్తుందని కొందరు, సన్నబియ్యం సీఎంఆర్‌ పెట్టడం ఇబ్బందిగా ఉంటుందని మరికొందరు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది.

సమస్య రాకుండా చూస్తాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుల సామర్థ్యం మేరకు దిగుమతి చేసుకునే ధాన్యం విలువలో 10శాతం డిపాజిట్‌ చేసిన వారికి ధాన్యం తీసుకునే అవకాశం ఇస్తాం. వానా కాలం డిపాజిట్‌ చేసిన వారు త్వరగా సీఎంఆర్‌ పూర్తి చేసి కొత్త ధాన్యం తీసుకునే అర్హత పొందాలి. ఇప్పటి వరకు మూడు మిల్లులు ఈ అర్హత పొందాయి. 15 మిల్లులు అర్హత పొందుతాయని భావిస్తున్నాం. మిల్లర్లు ముందుకు రాకపోతే ఇతర జిల్లాలకు పంపిస్తాం. ఎగుమతి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– ప్రేమ్‌ కుమార్‌, డీఎస్‌ఓ

యాసంగి ధాన్యం ఎగుమతిపై అధికారుల తర్జనభర్జన

డిపాజిట్‌ చెల్లించేందుకు

మిల్లర్లు వెనుకంజ

వానాకాలం సీఎంఆర్‌

ఆలస్యమే ప్రధాన కారణం

త్వరగా సీఎంఆర్‌ పెడితేనే ధాన్యం

మిల్లులకు తరలించే అవకాశం

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 61సెంటర్లు, పీఏసీఎస్‌ 162, ఇతర సెంటర్లు 16 మొత్తం 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 174 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు.

మూడు మిల్లులకే అర్హత1
1/1

మూడు మిల్లులకే అర్హత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement