
‘భూ భారతి’ రైతులకు వరం
కురవి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరంలాంటిదని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ వీరబహ్మచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం, పాలకులు రైతుల నుంచి ఎలాంటి సూచనలు తీసుకోకుండా ధరణి పోర్టల్‌ను ప్రారంభించి అన్యాయం చేసిందన్నారు. భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులున్నాయో తెలిపే రికార్డు ఈ భూ భారతి చట్టం అన్నారు. ఇందులో ఆరు మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. భూ హక్కుల రికార్డులను రూపొందించి. హక్కుల రికార్డుల్లో తప్పులను సరిచేయడం, వివాదాస్పద భూముల రిజిష్ట్రేషన్, మ్యుటేషన్‌కు అవకాశం, భూముల సర్వే చేసి మ్యాప్‌ను రైతు చేతికి అందించడం, వారసత్వంగా వచ్చిన భూములరిజిస్ట్రేషన్ విషయంలో అప్పిళ్లకు అవకాశం ఉంటుదన్నారు. ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్ లేదా సివిల్ రెవెన్యూ కోర్టు, లోక్ అదాలత్ అవార్డు, వివిధ మార్గాల ద్వారా పొందిన భూమికి హక్కులు సంభవిస్తే రికార్డులను సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకం అందిస్తామన్నారు. అప్పిల్ వ్యవస్థ ఏర్పాటు కూడా ఇందులో ఉంటుందన్నారు. తహసీల్దార్‌లపై ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారికి అసైన్డ్ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దాఽర్ సునీల్‌రెడ్డి, డీటీ గణేశ్, ఆర్‌ఐ నెల్లూరి రవికుమార్, చైర్మన్‌లు ఇస్లావత్ సుధాకర్, గార్లపాటి వెంకటరెడ్డి, కొర్ను రవీందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఇసుక రవాణాకు టోకెన్‌లు ఇవ్వండి
చిన్నగూడూరు: మండలంలోని విస్సంపల్లి గ్రామంలో గురువారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణాకు తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వడం లేదంటూ స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తహసీల్దార్‌ను మందలించారు. ‘నంబర్ ప్లేట్, అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోండి. ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ప్రజలకు ఏం పరిపాలన అందిస్తరు. రిటైర్మెంట్‌లో సస్పెండ్ అయితే ఎలా ఉంటదో మీకు తెలుసు, శనివారం లోపు టోకెన్లు జారీ చేయాలి లేదా మొదట సస్పెండ్ అయ్యేది మీరే’ అని తహసీల్దార్‌ను ఎమ్మెల్యే హెచ్చరించారు.
ప్రభుత్వ విప్,
ఎమ్మెల్యే రాంచంద్రునాయక్