
మతతత్వ పార్టీని అడ్డుకునేది కాంగ్రెస్సే
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
హన్మకొండ : మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్‌లోమూడ్రోజుల పాటు జరిగే బునియాదీ కార్యకర్త సమ్మేళన్ శిక్షణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, విప్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, మురళీ నాయక్ జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కొండా సురేఖ పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ శిక్షణ తరగతులు మూడు దశల్లో జరుగుతున్నాయన్నారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలు ఏకమైతేనే బీజేపీని తరిమికొట్టగలుగుతామన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..మణిపూర్ మారణహోమంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదప లేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఏఐసీసీ శిక్షణ తరగతుల కన్వీనర్ రాహుల్ బాలే, శిక్షణ తరగతుల ఇన్‌చార్జ్‌లు చంద్రకళ, గుగులోత్ రవీందర్‌నాయక్, నాయకులు రవళి, అనిల్, రాజేష్ నాయక్ పాల్గొన్నారు.