
ఏడేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
● ఉపాధ్యాయుల ప్రయత్నంతో ప్రాథమిక పాఠశాల రీఓపెన్
బయ్యారం: బడీడు పిల్లల నమోదు లేక ఏడు సంవత్సరాలు మూత పడిన ప్రభు త్వ పాఠశాల ఎంఈఓ, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి తెరుచుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త ఇర్సులా పురం ప్రాథమిక పాఠశాలను విద్యార్థుల నమోదు లేకపోవడంతో ఏడేళ్లక్రితం మూసివేశారు. దీంతో ఆ గ్రామ విద్యార్థులు మండలం కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎంఈఓ దేవేంద్రాచారి సూచనతో ఉపాధ్యాయులు బానోత్ రాజు, బేబి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. వారి ప్రయత్నంతో 23 మంది విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చే విద్యాసంవత్సరం(2025–26) పాఠశాలలో చదివించేందుకు అంగీకరించి అడ్మిషన్ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాలను ఎంఈఓ దేవేంద్రాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భద్రునాయక్, శోభన్, రామకృష్ణ, రాజు, బేబి, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు ఐలయ్య, వీరన్న, కృష్ణ, నరేశ్, లింగన్న, లివిన్, విజయ, అరుణ, మైబూబి తదితరులు పాల్గొన్నారు.