మహబూబ్‌నగర్: అన్నాచెల్లి బలవన్మరణంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పళ్ల ఏరియాలోని కోటవీధికి చెందిన చేనేత కుటుంబం అన్నాచెల్లెలు మహేష్ (35), లక్ష్మి (32) తల్లి రాములమ్మ కొన్నేళ్లుగా మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆదివారం రాత్రి అన్నాచెల్లి గొడవపడ్డారు.
దీంతో అన్న మహేష్ మనస్తాపంతో చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన చెల్లి చీరను కత్తిరించగా, అప్పటికే ఆయన మృతి చెందాడు. చెల్లి సైతం మానసిక స్థితి బాగులేకపోవడంతో ఉరేసుకుంది. తల్లి రాములమ్మకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఇంట్లో ఏమి అయ్యిందో తెలియని పరిస్థితి. తెల్లారేసరికి కొడుకు, కుతురుని పిలిచినా పలకకపోవడంతో రోధించింది.
చుట్టుపక్కల వారు వచ్చి చూడడంతో వారు మృతి చెందినట్లు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఏఎస్‌ఐ ఆరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చందాలు పోగుచేసి అంత్యక్రియలు..
అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్, నాయకులు కెంచె శ్రీనివాస్, గోపాల్‌యాదవ్, ఆ ప్రాంత యువకులు ముందుకు వచ్చి చందాలను పోగుచేశారు. పోలీసు అధికారులు సైతం వారికి తొచిన ఆర్థిక సాయం చేశారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించి యువకులు మానవత్వం చాటుకున్నారు.
రాములమ్మను జిల్లా ఆస్పత్రికి తరలింపు..
కొడుకు, కుమార్తె మృతి చెందడంతో తల్లి రాములమ్మ అనాథగా మారింది. పళ్ల ఏరియా యువకులు ఆమెను ఆటోలో వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగలేకపోవడంతో సిబ్బంది నిరాకరింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారాన్ని డీడబ్ల్యూఓ వేణుగోపాల్‌కు ఇవ్వగా ఆయన స్పందించి సఖి కేంద్రం నుంచి సిబ్బందిని పంపించారు. వృద్దురాలి ఆరోగ్యం బాగైన తర్వాత వృద్ధాశ్రమనికి తరలిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment