మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.30లక్షల ఎకరాలను సస్యశామలం చేయడంతో పాటు తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మరోసారి రాజకీయాస్త్రంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత సైతం అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాపై బీజేపీ, బీఆర్‌ఎస్.. ఇచ్చిన హామీ మేరకు గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని కాంగ్రెస్.. ఇందుకు అడ్డంకులు సృష్టిస్తూ కోర్టులకెక్కింది మీరే కాదా అంటూ గులాబీ పార్టీల పరస్పర విమర్శలతో దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించుకోవాలని గులాబీ బాస్ పిలుపునివ్వగా.. ప్రాజెక్ట్ పూర్తి చేయకముందే ప్రారంభోత్సవమా అంటూ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా రిజర్వాయర్ల సందర్శనకు తెర లేపడం పొలిటికల్ వార్‌కు సంకేతాలుగా నిలుస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారగా.. ఎన్నికల షెడ్యూల్ రాకముందే జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
నేడు కాంగ్రెస్ రిజర్వాయర్ల సందర్శన..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండా.. ప్రారంభోత్సవాల పేరుతో పండుగలు చేయడమేంటని ప్రశ్నిస్తూ.. ప్రాజెక్ట్ వాస్తవ స్థితిగతులను పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రాజెక్ట్ బాటకు సిద్ధమైంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు శనివారం నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను సందర్శించేందుకు సమాయత్తమయ్యారు.
ఇప్పటివరకు ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణంతో పాటు కొన్ని చోట్ల భూసేకరణ కూడా ఇంకా పూర్తికాలేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. త్వరలో వారు సైతం పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం.
అధికార పార్టీమరింత దూకుడుగా..
ఈ నెల 16న నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని ఇన్‌టేక్ వద్ద మొదటి మోటారు స్విచ్ ఆన్ చేసి నీటి పంపింగ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజల అనంతరం నార్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పండుగలా వైభవంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున సభకు హాజరయ్యేలా ఆ పార్టీ నాయకులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన మరుసటి రోజు 17న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు ఆలయాల్లోని దేవతామూర్తులను కృష్ణా జలాలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవాలని కేసీఆర్ సూచించారు.
అధికార బీఆర్‌ఎస్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం, ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా.. తిప్పికొట్టేలా బీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు గులాబీ నేతలు మరింతగా దూకుడుగా వ్యవహరించనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment