విద్యార్థి కంటికి సురక్ష
జడ్చర్ల టౌన్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం చూపును ప్రసాదిస్తోంది. ఆర్‌బీఎస్‌కే ద్వారా ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు నిర్వహించి సమస్యలున్న విద్యార్థులకు కంటి అద్దాలు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 2,355 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. ఫిబ్రవరి 28వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో 2,373 మందికి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,427 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 89,105 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరంతా చూపు మందగించి చదవడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్‌బీఎస్‌కేకు చెందిన ఏడు బృందాలు 2,373 మందికి పరీక్షలు జరపగా.. వారిలో 2,355 మందికి అద్దాలు వచ్చాయి. వీరందరికి అద్దాల పంపిణీ చేస్తున్నారు.
సమస్యలున్న వారికి అద్దాలు
విద్యార్థులకు కంటి చూపు అందించే లక్ష్యంగా వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలున్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఐఓ డా.పద్మజ తెలిపారు. బుధవారం బాదేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 14 మంది విద్యార్థులకు అద్దాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, ఆర్‌బీఎస్‌కే డాక్టర్లు సునీల్, లీల, కంటి వైద్యపరీక్ష నిపుణులు దత్తాత్రేయ రావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మనుప్రియ, హెచ్‌ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో 9,427మంది విద్యార్థులకు కంటి సమస్యలు
మహబూబ్‌నగర్ జిల్లాలో 2,355 మందికి అద్దాలు పంపిణీ
310 మందికి అద్దాలు..
జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో 310 మంది విద్యార్థులకు అద్దాలను పంపిణీ చేస్తున్నాం. ఫిబ్రవరి 28న హైస్కూళ్లు, గురుకులాల్లో చదవడానికి ఇబ్బంది పడే వారికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించాం. వీరందరికీ అద్దాలను అందజేస్తాం.
– డా.సునీల్, ఆర్‌బీఎస్‌కే, జడ్చర్ల
Comments
Please login to add a commentAdd a comment