
వైభవంగా అలివేలు మంగ కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు తిరుకల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ కల్యాణకట్ట వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామ స్మరణల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది.
కన్నుల పండువలా తిరుకల్యాణోత్సవం ..
కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణకట్ట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జిలకర్ర, బెల్లం తదితర పూజల అనంతరం శ్రీ అలివేలు మంగ మంగళసూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులకు పట్టు వస్త్రధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య ఈ దేవతామూర్తుల దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు ఈవేడుకలను కనులారా తిలకించి పునీతులయ్యారు. చాలా మంది దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున వారి చేతులకు పసుపుకొమ్మలను ధరింపచేశారు. కల్యాణోత్సవం అనంతరం ఈ దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ కట్ట నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలా మంది దేవస్థానంలో కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కొంత మంది భక్తులు దేవస్థానం ముందున్న ధ్వజస్తంభం వద్ద రూపాయి నాణేలను ఉంచి తమ అదృష్ట పరీక్షను చూసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలువేలమ్మ, సుధా, మంజుల పాల్గొన్నారు.
మంత్రోచ్ఛరణల నడుమ వేంకటేశ్వర, అలివేలు కల్యాణోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
అన్నదాన కార్యక్రమం

వైభవంగా అలివేలు మంగ కల్యాణం

వైభవంగా అలివేలు మంగ కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment