చికిత్స పొందుతూ మహిళ మృతి
గట్టు : మండలంలోని రాయాపురానికి చెందిన సరోజమ్మ(50) పాము కాటుకు గురై గద్వాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. వివరాలు.. రాయాపురానికి చెందిన భార్యాభర్తలు సరోజమ్మ, హనుమంతు గురువారం వ్యవసాయ పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే క్రమంలో వంట చెరుకు కోసం కట్టెలను మూట కట్టుకుంటున్న తరుణంలో సరోజమ్మను పాము కాటేసింది. విషయం తెలుసుకున్న భర్త హనుమంతు హుటాహుటిన సరోజమ్మను గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో అక్కడి నుంచి గద్వాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందగా భర్త హనుమంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిప్పంటుకొని గొర్రె పిల్లలు..
ఊట్కూరు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గొర్రెపిల్లలు మృతిచెందిన సంఘటన ఊట్కూరు శివారులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు అయ్యలప్ప, తిప్పన్న, కురువ బలరాం, చెన్నప్ప, కొండప్ప సుమారు 60 గొర్రె పిల్లలను గ్రామశివారులో ఓ రైతు పొలం దగ్గర ముళ్లతో కంచె ఏర్పాటుచేసి అందులో ఉంచారు. గొర్రెలను మేపడానికి వారంతా వెళ్లారు. మధ్యాహ్నం వేళ పొలాల గట్లకు నిప్పంటుకొని గొర్రెలు నిల్వఉన్న ప్రాంతానికి వ్యాపించింది. దీంతో సుమారు 50 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. నిప్పంటుకున్న విషయాన్ని తెలుసుకున్న గొర్రెల కాపరులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పగా అప్పటికే 50 గొర్రెపిల్లలు మృతి చెందగా 10 గొర్రె పిల్లలు గాయాలతో మిగిలాయి. సుమారు రూ. 2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment