కొనసాగుతున్న సహాయక చర్యలు
మార్గనిర్దేశనం చేస్తున్నాం..
ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. శనివారం ఉదయం సొరంగంలోని పరిస్థితులపై కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్‌తోపాటు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సొరంగంలో జరుగుతున్న పురోగతిపై సమీక్షించి అవసరమైన మార్పులను అమలు చేస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక బృందాల మధ్య సమన్వయంతో పనులు చేపడుతున్నామని, మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక రోబోటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అన్వి రోబోటిక్ సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 30 హెచ్‌పీ సామర్థ్యం గల పంపుతో అనుసంధానమైన వాక్యూమ్ ట్యాంకు ఉపయోగించి నీటితో కూడిన బురద, మట్టిని తొలగించనున్నట్లు తెలిపారు. సొరంగంలోని నీటిని తొలగించేందుకు డీ–వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధునిక పరికరాలు ఉపయోగించి శరవేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా, వైద్యసేవలు, ఆహారం, మంచినీరు వంటి అవసరాలను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాధాన్యంగా సహాయక బృందాల భద్రతకు దృష్టిలో పెట్టుకుని అత్యవసర అవసరాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. అనంతరం లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంక్‌తో కూడిన మిషన్ పనితీరు పరిశీలించారు.
అచ్చంపేట/ ఉప్పునుంతల: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అడుగడుగునా అన్వేషిస్తున్నారు. 22 రోజులు గడుస్తున్నా ఇంత వరకు వారీ ఆచూకీ దొరకలేదు. మానవ ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఏఐ టెక్నాలజీ ద్వారా అన్వి రోబోటిక్ సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్‌పీ సామర్థ్యం గల పంపు, వాక్యూమ్ ట్యాంకు ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం వాటిని సొరంగం వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్‌స్టాలేషన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో రోబో యంత్రాల పనితీరు ఇంకా ప్రారంభం కాలేదు. డీ2 ప్రదేశం నుంచి డీ1 వరకు సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర సహాయక బృందాలు మట్టి, బురద తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టీబీఎం ఎర్త్ కట్టర్ ఉన్న ప్రాంతం పూర్తిగా 40 అడుగుల మేర కూరుకుపోయింది. అక్కడి వరకు మనుషులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా ఉంది. టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో తొలగిస్తున్నారు. డీ1 డేంజర్ జోన్ ప్రాంతంలో పైకప్పు బలహీనంగా ఉండటంతో కాంక్రీట్ సెగ్మెంట్ కూడా పడిపోయే పరిస్థితి గమనించి సింగరేణి గనుల్లో ఉపయోగించే టైగర్ కారడ్స్ కలప దుంగలను సపోర్టుగా చేసుకుంటూ తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వీటిని నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. వీటికి సుమారు 40 టన్నుల బరువు ఆపగలగే శక్తి ఉంది. ప్రమాదం జరిగే ముందు శబ్ధం వస్తుందని, దీని వల్ల కార్మికులు సురక్షితంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని సింగరేణి కార్మికులు వెల్లడించారు. డీ1 ప్రదేశానికి వెళ్లడానికి ఇంకా 30 మీటర్ల మట్టిని తొలగిస్తే సహాయక బృందాలు అక్కడికి చేరకుంటాయి. డీ1 వద్దకు చేరుకుంటే తప్ప తప్పిపోయిన కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డీ1 వద్ద పూర్తిస్థాయిలో మట్టిని తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో లభ్యం కాని కార్మికుల ఆచూకీ
కనీసం ఆనవాళ్లు కూడా లభించని వైనం
హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనితీరుపైనే ఆశలు
డీ1 జోన్ ప్రాంతంలో బలహీనంగా పైకప్పు
22 రోజులు శ్రమిస్తున్న సహాయక బృందాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
Comments
Please login to add a commentAdd a comment