పండ్లకు భలే గిరాకీ
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ మాసంలో పండ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. మిగతా రోజుల కంటే ఈ మాసంలో పండ్ల వినియోగం అధికంగా ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. అరటి పండ్ల డజన్ ధర గత వారంతో పోలిస్తే రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగింది. ద్రాక్ష పండ్లు అయితే కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ద్రాక్ష పండ్ల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ మాసంలో ఎక్కువగా వినియోగించే కర్బుజా (పుచ్చకాయ) పండు కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. రంజాన్ ఉసవాసదీక్షలో ముస్లింలు రోజు సాయంత్రం ఇఫ్తార్ వేళ పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. యాపిల్, ఖర్జూర, పుచ్చకాయలు, పైనాపిల్, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, అరటి, సపోట వంటి పండ్ల వినియోగం పెరగడంతో వీటి ధరల్లో రోజురోజుకు మార్పు కనిపిస్తుంది. ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులకు భారీఎత్తున పండ్లు అవసరమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని పండ్ల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, జనరల్ ఆస్పత్రి, న్యూటౌన్, క్లాక్‌టవర్, అంబేడ్కర్ చౌరస్తా, పద్మావతికాలనీతోపాటు ఇతర ప్రాంతాల్లో పండ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. రూ.20 నుంచి 25 వరకు ఉన్న యాపిల్ రంజాన్ మాసంలో రూ.30 నుంచి 35 వరకు, ఆరెంజ్ పండ్లు డజన్ ప్రకారం రూ.180 నుంచి 200 వరకు అమ్ముతున్నారు.
ఉపవాసదీక్షలతో పెరిగిన వినియోగం
రిటైల్‌గా జోరందుకున్న వ్యాపారం
అమాంతంగా పెరిగిన ధరలు
Comments
Please login to add a commentAdd a comment