నల్లగొండకు నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు
కల్వకుర్తి రూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించి దాదాపు 12 ఏళ్లు కావొస్తున్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఇంకా అన్యాయమే జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. శనివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఏదుల నుంచి నల్లగొండకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ.1,800 కోట్లు కేటాయిస్తూ గత జనవరి 22న జీఓ నంబర్ 11ను విడుదల చేయడం బాధాకరమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో డిండి ప్రాజెక్టు ఎత్తు పెంచి నల్లగొండకు నీటిని తరలించే విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు నార్లాపూర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాలు వ్యతిరేకించడంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం నల్లగొండకు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం పాలమూరు రైతుల పొలాలను బీడుగా మార్చడమేనని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి జిల్లా రైతులు లక్ష ఎకరాల భూములను కోల్పోయినా ఫలితం దక్కలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. అన్ని పార్టీలు నల్లగొండ జిల్లాకు చెందిన వారికి నాలుగు స్థానాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు ఉంటే రాజకీయాలను శాసించగల శక్తి ఉంటుందన్నారు. ప్రభుత్వాలు భూములను త్యాగం చేసిన రైతులను విస్మరిస్తుండటంతో.. ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులను చైతన్యం చేసి ఏదుల నుంచి నల్లగొండకు నీటి తరలింపును అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ రాశామని తెలిపారు.
● మండలంలోని ముకురాలలో ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించి.. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు రాఘవాచారి చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని కోరారు. సమావేశంలో అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, సభ్యులు శ్రీను, సదానందం గౌడ్, మేకల రాజేందర్ పాల్గొన్నారు.
ఏదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలి
పాలమూరు అధ్యయన వేదిక
జిల్లా కన్వీనర్ రాఘవాచారి
Comments
Please login to add a commentAdd a comment