అఘోరిని అడ్డుకున్న పోలీసులు
అలంపూర్: అలంపూర్‌కు వెళ్లకుండా మహిళా అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల్లో భాగంగా నాగసాధువు అఘోరిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి టోయింగ్ వాహనం ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. నాగసాధువు మహిళా అఘోరి ఇటీవలే అలంపూర్‌లోని దర్గాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా మహిళా అఘోరి శనివారం అలంపూర్‌కు వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచే పోలీసులు అలంపూర్ చౌరస్తా, డి.బూడిదపాడు, భైరాపురం స్టేజీ వద్ద పహారా కాశారు. డీఎస్పీ మొగులయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, శాంతినగర్ సీఐ టాటబాబుతో పాటు ఎస్‌ఐలు, పోలీసులు భైరాపురం స్టేజీ వద్ద పహారా ఏర్పాటు చేశారు. మహిళా అఘోరి వాహనం భైరాపురం స్టేజీకి చేరుకున్న సమయంలో పోలీసులు అక్కడే నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలంపూర్‌కు వెళ్లడానికి అనుమతి లేదని, వెనక్కి వెళ్లాలని సూచించారు. ఈక్రమంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. అఘోరి దేవతా విగ్రహాలను బయటికి తీసి చూపించారు. వాటిని పరిశీలించడానికి వెళ్తున్న పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు సైతం అదేస్థాయిలో స్పందించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు మరోసారి అఘోరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ అఘోరి కారులో కూర్చోని బయటికి రాలేదు. దీంతో మహిళా ఎస్‌ఐలు, పోలీసులు సైతం నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. దాదాపు గంటకుపైగా నిరీక్షించిన పోలీసులు చివరకు అఘోరి కూర్చున్న కారును జేసీబీ సాయంతో అక్కడికి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆది సాధ్యపడకపోవడంతో ప్రైవేటు టోయింగ్ వాహనాన్ని పిలిపించారు. టోయింగ్ వాహన సాయంతో మహిళా ఆఘోరి కారును తరలించారు. టోయింగ్ వాహనంతో తరలించే క్రమంలో కారులోనే ఉన్న అఘోరి కిందకు దిగడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వెళ్లడంతో తిరిగి కారులోనే కూర్చున్నారు. దీంతో ఉండవెల్లి మీదుగా జాతీయరహదారి ఎక్కి హైదారాబాద్ వైపు తీసుకెళ్లారు. టోయింగ్ వాహనంతో తీసుకెళ్తున్న క్రమంలో తన కారులోనే కూర్చున్న అఘోరిని గాలి కోసం అద్దం కిందికి దించుకోవాలని సూచించగా అసహనంతో అద్దం పగలగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈవిషయమై సీఐ రవిబాబు మాట్లాడుతూ ఇటీవలే చేసిన వ్యాఖ్యల కారణంగా అఘోరిని అడ్డుకున్నట్లు తెలిపారు. ముందస్తు అరెస్టు చేసి తరలించినట్లు వెల్లడించారు.
భైరాపురం స్టేజీ వద్దనే నిలిపివేత
వెనక్కి వెళ్లాలని
నచ్చజెప్పిన పోలీసులు
ససేమీరా అంటూ అక్కడే ఉన్న అఘోరి
వాహనంతో సహా టోయింగ్‌తో తరలింపు
అఘోరిని అడ్డుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment