కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్
స్టేషన్ మహబూబ్‌నగర్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్లలో పట్టించుకోలేదని, కాని ఎన్నికల సంవత్సరం అరకొరగా ఆర్థికసాయం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక విప్లవకారుడని, ఆయన నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకంలో బ్యాంకు లింకేజీతో ఒక్కో లబ్ధిదారుడికి రూ.3లక్షల వరకు ఆర్థికసాయం అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఈ పథకం కింద లబ్ధిచేకూరుతుందన్నారు. ఈనెల 15న నోటిఫికేషన్ విడుదలైందని, వచ్చేనెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ నుచి 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జూన్ 2న లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తామని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.800 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్‌కుమార్, నాయకులు ఎన్‌పీ.వెంకటేశ్, సీజే బెనహర్, నాగరాజు, రాములుయాదవ్, పీర్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
రూ.6 వేల కోట్లతో
రాజీవ్ యువ వికాసం
టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
Comments
Please login to add a commentAdd a comment