బెట్టింగ్ యాప్స్‌నుప్రోత్సహిస్తే కఠిన చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని రకాల అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల యువత, విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్ యాప్స్‌లో పాల్గొంటూ అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురై, చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించి, అక్రమ బెట్టింగ్ యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అక్రమ యాప్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు అపహరించే ప్రమాదం ఉందని, అక్రమ యాప్స్‌లో డబ్బులు పెట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
2 వేల బస్తాల వేరుశనగ రాక
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం 2,329 బస్తాల వేరుశనగ వచ్చింది. కాగా వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,990, కనిష్టంగా రూ.5,505 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమే్‌ష్ తెలిపారు. సీజన్ ముగుస్తున్న సమయంలో వేరుశనగ పోటెత్తడం గమనార్హం.
నిర్వాసితులకు న్యాయం చేశాకే పనులు చేపట్టాలి
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేశాకే రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఆదివారం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ తదితర పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలన్నారు. ఉదండాపూర్‌లో రీసర్వేకు సంపూర్ణంగా సహకరించామని, తమకు పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంచి అందించాలని కోరారు. అలాగే 18 ఏళ్లు వయస్సు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు అడ్డుకున్నారన్న కారణాలు చూపుతూ తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment