మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి, అవబృత స్నానం, నాకబలి (నాగవెల్లి), ద్వాదశరాధన, సప్తవరణులు, మహాదాశీర్వచనం చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సుదర్శన పెరుమాళ్లను ఊరేగింపుగా దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం నుంచి ఘాట్‌రోడ్డు గుండా గుట్టపైనున్న బావి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు పురోహితులు సంప్రదాయ రీతిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్లను పూలతో శోభాయమానంగా అలంకరించి దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకురావడంతో అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి విశేషోత్సవాల్లో పాల్గొని తరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలివేలమ్మ, సుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment