‘10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గం’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జనాభాలో కేవ లం 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గమని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకటయాదవ్ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల రిజర్వేషన్లు అతిపెద్ద తప్పిదమని, దీంతో బలహీనవర్గాలకు నష్టం జరుగుతుందన్నారు. సమాజంలో అణగారిన, బలహీన, పీడిత వర్గాలకు మాత్రమే సంఘాలు ఉండాలని, అలాంటిది పాలక పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా సంఘాలను పెట్టుకొని వాళ్లకు అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసుకుంటున్నారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎవరి వాటా వారికి దక్కాలని డిమాండ్ చేశారు. ప్రతి యాదవ బిడ్డ చదువుకోవాలని అందుకోసం వారి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో యాదవుల వాటా కోసం ప్రతిఒక్కరు పోరాటం చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో రానున్న 15 రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుయాదవ్, నాయకులు రవికుమార్‌యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలుయాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment