ఆటంకంగా మారిన నీటి ఊట
అచ్చంపేట/మన్ననూర్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి ఊట వల్ల తవ్వేకొద్దీ బురద, మట్టి వస్తోంది. భారీగా వస్తున్న నీటి ఊటను మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపింగ్ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన ఏడుగురిని బయటికి తెచ్చేందుకు సహాయక బృందాలు 23 రోజులుగా శ్రమిస్తూనే ఉన్నాయి. కాడవర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో బిగుసుకుపోయిన బురద తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 12 బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. తవ్వకాల్లో అడుగడుగునా టీబీఎం పైకప్పు మెటల్ ప్లాట్‌ఫాం, పెద్దపెద్ద ఇనుపరాండ్లు అడ్డుగా వస్తున్నాయి. చిన్నచిన్న వాటిని ఎప్పటికప్పుడు ప్లాస్మా కట్టర్‌తో కట్‌చేసి తొలగిస్తున్నారు. పెద్ద రాండ్లను కట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. రెండు జనరేటర్స్ సహాయంతో మట్టి, బుదరను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. సొరంగంలో అప్పుడప్పుడు వస్తున్న దుర్వాసనతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిసింది.
అందుబాటులోకి రాని రోబో సేవలు..
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఐదు రోజుల క్రితం ఇక్కడికి చేరిన అటాన్‌మస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో సేవలు ఇంకా మొదలు కాలేదు. సొరంగం ఇన్‌లెట్ వద్ద నుంచే ఆపరేటింగ్(కమ్యూనికేషన్) చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ఆధారిత మాస్టర్ రోబోతో పాటు పవర్డ్ హైడ్రాలిక్ రోబోకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన 30 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకు ఇన్‌స్టాలేషన్ పూర్తయినా ఆదివారం సాయంత్రం కూడా సొరంగం లోపలికి వెళ్లలేదు. సొరంగంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హైడ్రాలిక్ రోబోకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఇది నిరంతరాయం పనిచేసేందుకు అదనపు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీబీఎం శకలాలతో..
పూర్తిగా ఉక్కుతో తయారైన పవర్డ్ హడ్రాలిక్ రోబో హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తోంది. రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్దపెద్ద రాళ్లు, రప్పలు, శిథిలాలను ముక్కులుగా చేయడంతో పాటు బురదను వాక్యూమ్ పంపు సహాయంతో నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగం లోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అయితే సొరంగంలో రాళ్లు, బురదతో పాటు టీబీఎం విడి భాగాలు ఉండటం వల్ల రోబోలకు కూడా సహాయక సిబ్బందికి ఎదురవుతున్న సమస్యే నెలకొంది. టీబీఎం శకలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిిపించడం లేదు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో
23 రోజులైనా లభించని ఏడుగురి ఆచూకీ
Comments
Please login to add a commentAdd a comment