మహబూబ్‌నగర్ టు మక్కా షరీఫ్
స్టేషన్ మహబూబ్‌నగర్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ మాసంలో నిర్వహించే ఆరాధనలకు దేవుడు 70 రెట్లు ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తారని ముస్లింల నమ్మకం. ఏటా ఈ మాసంలోనే మక్కా, మదీనాలోని పుణ్య ప్రదేశాలైన కాబా ప్రదక్షిణ, మదీనాలోగల మసీదులోని ప్రార్థనల కోసం ముస్లింలు ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్నారు. ప్యాకేజీల వారీగా కొంత మంది 15 రోజులు, నెలరోజులపాటు మక్కా, మదీనాలోనే ఉంటారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు ఎక్కువ పుణ్యం దక్కుతుందని భావిస్తారు. అక్కడే రంజాన్ ఉపవాస దీక్షలు పాటిస్తూ దైవస్మరణలో తరిస్తారు.
వందల సంఖ్యలో..
కొన్నేళ్లుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మిగతా రోజుల్లో ఉమ్రాయాత్ర కంటే రంజాన్ మాసంలో ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లింలు మక్కా, మదీనాకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి వందల సంఖ్యలో ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు. దాదాపు 300 నుంచి 400 వరకు ఉమ్రాయాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది మక్కా షరీఫ్ యాత్రకు వెళ్లారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పదుల సంఖ్యలో హజ్, ఉమ్రా ట్రావెల్స్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఇక్కడి ట్రావెల్స్, మరికొంత మంది హైదరాబాద్‌లోని ట్రావెల్స్‌ల ద్వారా ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు.
మానసిక ప్రశాంతత..
కొన్నేళ్ల నుంచి రంజాన్ మాసంలో ఉమ్రాయాత్ర చేస్తున్న. ఉమ్రాయాత్రతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ రంజాన్ మాసంలో 15 రోజులు మక్కా, మదీనా షరీఫ్‌లో దైవ ప్రార్థనలో నిమగ్నమై ఈ నెల 10న ఇంటికి వచ్చాను. ఆ అల్లా దయవల్లే ప్రతి ఏడాది రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం లభిస్తుంది.
– అబ్దుల్ జకీ, ఉమ్రా యాత్రికుడు, మహబూబ్‌నగర్
అదృష్టంగా భావిస్తున్నా..
ఇప్పటి వరకు రెండుసార్లు ఉమ్రాయా త్ర చేశాను. 2018 సంవత్సరంలో పవి త్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లాను. రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ముస్లింలు రంజాన్‌లో ఉమ్రాయాత్ర చేయడానికి వెళ్తున్నారు.
– మొహ్‌సిన్‌పాష ఖాద్రీ, మహబూబ్‌నగర్
రంజాన్‌లో ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలు
మహబూబ్‌నగర్ టు మక్కా షరీఫ్
మహబూబ్‌నగర్ టు మక్కా షరీఫ్
Comments
Please login to add a commentAdd a comment