నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటి విషయంలో పాలమూరుకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుందన్నారు. సాగునీటి పోరాటం తర్వాత ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన వంటి పోరాటాలు తది దశకు చేరుకోగా.. సాగునీటి పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతుందన్నారు. నల్లగొండకు నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి నీటిని తరలించడం అన్యాయం చేయడమేనన్నారు. ఏదుల రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ మాత్రమే కేటాయించారని.. అందులో అర టీఎంసీ నీటిని డిండికి తరలించడం వల్ల ఉద్దండాపూర్, వట్టెం, కరివెన వరకు నీరు పారే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు లేవని.. ఇప్పుడు నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకించాలని కోరారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ధర్నాలు చేసిన నాయకులు ప్రస్తుతం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నుంచి ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా భూములు నష్టపోయేది ఈ ప్రాంత రైతులేనని అన్నారు. ఇటీవల ప్రకటించన గ్రూప్–3 ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు తప్పుగా వేసినందుకు వారిని పక్కన పెట్టారని.. మరోసారి పరిశీలించి మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో టీడీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌నాయక్, రాష్ట్ర కౌన్సిలర్ కృష్ణయ్య, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, మద్దిలేటి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment