మహిళా సంఘాల బలోపేతం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ (ఎస్‌ఎంసీ) సుజాత ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్‌పీలు, ఓబీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 2,858 ఎస్‌హెచ్‌జీలు ఉండగా కొత్తగా మరో 477 ఈనెలా ఖరులోగా ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఇప్పటివరకు 218 కొత్తవి అయ్యాయని ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి బదులిచ్చారు. అమృత్‌మిత్ర పథకం కింద నగరంలోని 49 డివిజన్లకు గాను నాలుగు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేక బృందా (ఎస్‌హెచ్‌జీ) లతో తాగునీటి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఈ నాలుగు బృందాలలో సుమారు 25 మంది ఎస్‌హెచ్‌జీలు ఉన్నారని వివరించారు. గత నవంబర్ నుంచి బండ్లగేరి, మోతీనగర్, పద్మావతి కాలని, మర్లులో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. కాగా, మరో పది డివిజన్లకు ఈ పథకం విస్తరింపజేయాలని ఎస్‌ఎంసీ సూచించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒక్కో ఇంటికి రూ.20 చొప్పున బృందంలోని సభ్యురాలికి పారితోషికం ఇస్తామన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు సరఫరా అవుతోందా? లేదా? క్లోరినేషన్ చేస్తున్నది? లేనిది? ఈ పరీక్షల్లో బయట పడుతుందన్నారు. ఒకవేళ తాగునీటిలో ఒక శాతానికి మించి క్లోరిన్ ఉంటే కలుషితమైనట్లుగా భావించి వెంటనే ఇంజినీరింగ్ అధికారులకు నివేదించాలన్నారు. అనంతరం ఈ పరీక్షలు క్షేత్రస్థాయిలో ఎలా నిర్వహిస్తున్నది ప్రత్యేక బృందాలు ప్రయోగాత్మకంగా మెప్మా భవనంలో ఆమెకు వివరించారు. అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఎస్‌ఎంసీ కలిసి నగరంలో మెప్మా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆరా తీశారు. ఆయా సమావేశాల్లో ఇన్‌చార్జ్ ఎంఈ సందీప్, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ సుజాత
Comments
Please login to add a commentAdd a comment