ఊరూరా శ్రీరామోత్సవాలు నిర్వహించాలి
జడ్చర్ల: ఉగాది పర్వదినం మొదలుకొని హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలను ఊరూరా అట్టహాసంగా నిర్వహించాలని వీహెచ్‌పీ కేంద్రీయ కార్యదర్శి సుధాంశు మోహన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జడ్చర్ల మాధవీయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆరు జిల్లాలకు చెందిన వీహెచ్‌పీ ముఖ్యకార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వీహెచ్‌పీ కార్యకర్త కనీసంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హిందూ సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. వీహెచ్‌పీ బలోపేతం కోసం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రతి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సత్సంగాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి కార్యకర్త రెండు సత్సంగాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. వీహెచ్‌పీతో పాటు భజరంగ్‌దళ్, మాతృశక్తి, దుర్గావాహిని కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వీరికి వచ్చే రెండు నెలల్లో ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత భజరంగ్‌దళ్ శిక్షణ పొందే విధంగా, మిగతా వీహెచ్‌పీ కార్యకర్తలు శిక్షావర్గ పూర్తిచేసే విధంగా కృషి చేయాలన్నారు. అదే విధంగా యువతి విభాగానికి సంబంధించి దుర్గావాహణి ఆధ్వర్యంలో శిక్షావర్గలో పాల్గొనే విధంగా చూడాలని తెలిపారు. ఆత్మరక్షణ కోసం నేర్పించే విద్యలతో యువతులు సమాజంలోని సమస్యలను అధిగమించాలని కోరారు. సమావేశంలో వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహామూర్తి, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, విభాగ్ కార్యదర్శి నరేందర్, సహకార్యదర్శులు లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment