సహాయక చర్యలు ముమ్మరం
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ సోమవారం కూడా దొరకలేదు. టన్నెల్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గత 24 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన ఎనిమిది మందిలో టీబీఎం ఆపరేటర్ మృతదేహం లభించగా.. మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు షిఫ్ట్‌ల వారీగా సొరంగంలోకి వెళ్లి తవ్వకాలు జరుపుతున్నారు. డీ2 ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినా కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో డీ1 ప్రదేశంలో ప్రధానంగా రెండు రోజుల నుంచి తవ్వకాలు అతికష్టంగా సహాయక బృందాలు చేపడుతున్నాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తున్నా పురోగతి లేకపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి కాడవర్ డాగ్స్‌ను సొరంగంలోని డీ–1, డీ–2 ప్రదేశాల్లో గాలింపు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సొరంగంలోని డీ1, డీ2 ప్రదేశాల్లో టీబీఎం పరికరాలు మట్టిలో కూరుకుపోవడంతో పైనుంచి ఉబికి వస్తున్న ఊట నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది. టీబీఎం ముందు భాగంలోని చివరి 40 మీటర్ల వద్ద మట్టి, రాళ్లు, టీబీఎం శకలాలను కదలిస్తే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ దశలో సహాయక చర్యలు సిబ్బందికి సవాల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆరు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకులు పనిచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టెక్నీషియన్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉన్నతాధికారుల సమీక్ష..
టన్నెల్ డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఉదయం టన్నెల్ వద్ద పరిస్థితులపై కలెక్టర్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్‌తో కలిసి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నామని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను తొలగించే పనులు కొనసాగిస్తూ ఎస్కవేటర్ వద్ద మట్టి తొలగించే పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. డీవాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, బృందాలకు అవసరమైన సామగ్రి, సిబ్బంది భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశామన్నారు.
మొరాయిస్తున్న కన్వేయర్ బెల్టు
సొరంగంలో సహాయక బృందాలు చేపడుతున్న గాలింపు చర్యలకు ఊట నీరు ఆటంకం కలిగిస్తోంది. 13.5 కి.మీ., తర్వాత ఏర్పాటు చేసిన డీ–2 ప్రాంతంలో ఒక కాల్వలో నీళ్లు పెరుగుతున్నాయి. నీటిని డీవాటరింగ్ చేసేందుకు ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపించే చర్యలు తీసుకుంటున్న నీటి ఊట తగ్గడం లేదు. సొరంగంలోని బురద, మట్టిని బయటకు పంపడానికి ప్రధానంగా కన్వేయర్ బెల్టు కీలకం. కానీ, ఈ కన్వేయర్ బెల్టు తరుచుగా మొరాయిస్తుండటం.. దాని స్థాయికి తగ్గట్టు పనిచేయకపోవడంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతున్నాయి. డీ–1 పాయింట్ వద్ద గత రెండు రోజుల నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టీబీఎం వద్ద దక్షిణమధ్య రైల్వేకు చెందిన రెస్క్యూ బృందాలు శకలాలను కట్ చేస్తూ విడి భాగాలను బయటకి పంపిస్తున్నారు. అత్యంత ప్రమాదంగా గుర్తించిన డీ1 వద్ద ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రోబో సేవలు అందుబాటులోకి రాకపోవడంతో కార్మికుల జాడ లభించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
24 రోజులు గడిచినా లభించని కార్మికుల ఆచూకీ
నిర్విరామంగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
ఎస్‌ఎల్‌బీసీలో
అందుబాటులోకి రాని రోబో సేవలు
సహాయక చర్యలు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment