శాంతినగర్: ఆర్డీఎస్ కెనాల్ కింద సాగు చేసిన పంటలు ఎండుతున్నాయని, తుమ్మిళ్ల లిఫ్ట్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఽజూలెకల్ శివారులోని ఆర్డీఎస్ కెనాల్‌లో బుధవారం ధర్నా చేపట్టారు. గత 14 రోజుల క్రితం నిలిచిపోయిన తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్ ఇప్పటి వరకు ఆన్ చేయలేదని, ఇండెంట్ నీరు విడుదల చేసినా రాకపోవడం అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా కనీసం రెండు తడులైనా నీరు అందజేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజగోపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.