జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోడైవర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో భద్రపర్చిన నీరుకట్టపాము సోమవారం పురుడు పోసుకుంది. మండలంలోని నసురుల్లాబాద్‌లో నాలుగురోజుల క్రితం ఓఇంట్లోకి పామురాగా సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్‌ద్వారా సమాచారమిచ్చారు. దీంతో ఆయన శిష్యులను పామును పట్టుకురమ్మని పంపించగా వారు వెళ్లి నీరుకట్ట పాముగా గుర్తించి పట్టుకున్నారు. పాముతో పాటు అది పెట్టిన 21గుడ్లను సైతం కళాశాల బయో డైవర్సిటీ రీసెర్చ్‌అండ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. గుడ్లను పొదిగేందుకు కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవటంతో హైదరాబాద్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించేందుకు భద్రపర్చారు. భద్రపర్చిన గుడ్లలో సోమవారం 10పిల్లలు బయటకు వచ్చాయి. పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు తెలిపారు. ఈకాలంలో నీరుకట్ట పాము గుడ్లు పిల్లలను లేపే అవకాశం అధికంగా ఉంటుందని, ఎక్కువగా తడితో కూడిన ప్రదేశంలో భూమిలోని రంధ్రాల్లో గుడ్లను పెట్టి ఉంటాయని సర్పరక్షకుడు డా.సదాశివయ్య తెలిపారు. నీరుకట్ట గుడ్లనుంచి పాము పిల్లలు బయటకు రావటంపై కళాశాల ప్రిన్సిపాల్ డా. సుకన్య ఆనందం వ్యక్తం చేశారు.