స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం కింద నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం ఆన్‌లైన్ ద్వారా కుట్టుమిషన్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించగా.. ఇప్పుడు వీటిని పంపిణీ చేయనున్నారు.
15 వేలకుపైగా దరఖాస్తులు
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఫేజ్–1 కింద 10,490 కుట్టుమిషన్లు మంజూరయ్యాయి. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 2,400 కుట్టుమిషన్లను మైనార్టీ మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 15 వేలకుపైగా దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 2న వనపర్తి జిల్లాకేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కుట్టుమిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో 2 వేల మిషన్లను లబ్ధిదారులకు ప్రత్యేకంగా పంపిణీ చేయనున్నారు.
నిరుద్యోగులకు రాజీవ్ యువవికాసం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం గత నెల 11న ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా సబ్సిడీ రుణాలు అందించనున్నారు. దీనికోసం ఈ నెల 5 వరకు దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ జరగనుంది. 6 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక, జూన్ 2న ఎంపికై న వారికి మంజూరు పత్రాలు అందజేయనున్నారు. బ్యాంకు లీంకేజీ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు మైనార్టీ నిరుద్యోగ యువతకు దాదాపు 3 వేలకుపైగా యూనిట్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాల వారీగా కుట్టుమిషన్ల
కేటాయింపు ఇలా..
జిల్లా కుట్టుమిషన్లు
మహబూబ్‌నగర్ 700
నాగర్‌కర్నూల్ 700
నారాయణపేట 350
వనపర్తి 350
జోగుళాంబ గద్వాల 300
మైనార్టీ మహిళలకు
కుట్టుమిషన్ల పంపిణీ
ఉమ్మడి జిల్లాకు 2,400
మిషన్లు కేటాయింపు
త్వరలో అర్హులకు
అందజేయనున్న ఎమ్మెల్యేలు
మైనార్టీల సంక్షేమానికి కృషి
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీల్లోని నిరుపేద వర్గాలకు స్వయం ఉపాధి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా 80 శాతం, 60 శాతం, 70 శాతం సబ్సిడీతో రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందిస్తాం. రాజీవ్ యువ వికాసం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.850 కోట్లు కేటాయించింది.
– ఒబేదుల్లా కొత్వాల్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్